కెసియార్‌ వెన్నులో వణుకు పుట్టింది

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసియార్‌) భయపడలేదు. అంతెందుకు, కోదండరామ్‌ తమ ప్రభుత్వాన్ని కుదిపేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కెసియార్‌ని ఒకటి భయపెట్టింది. అలా ఇలా కాదు, వెన్నులో వణుకుపుట్టేలా చేసింది. అదే పోలియో వైరస్‌. హైద్రాబాద్‌లోని ఓ మురికి కాలువ నీటి శాంపిల్స్‌ని పరీక్షిస్తే అందులో పోలియో వైరస్‌ వెలుగు చూడటంతో కెసియార్‌ షాక్‌కి గురయ్యారు.

దేశం నుంచి పోలియో వైరస్‌ని ఎప్పుడో తరిమికొట్టేశాం. రెండేళ్ళుగా దేశంలో ఎక్కడా పోలియో కేసులు బయటపడలేదు. అలాంటిది తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌లో అది కూడా ఓ మురికి కాలవ నీటిలో పోలియో వైరస్‌ బయటపడటం చిన్న విషయం కాదు. అదెలా వచ్చింది? అనే అంశంపై పరిశోధనలు ఓ పక్క జరుగుతుండగా, తెలంగాణ అంతటా పోలియో వైరస్‌పై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలనీ ముందుగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పోలియో వైరస్‌ని అడ్డుకునేందుకు వ్యాక్సిన్లు ఇవ్వాలని కెసియార్‌ ఆదేశాలు జారీ చేశారు. రెండు మూడు దశాబ్దాల క్రితం పోలియో బాధితులు దేశంలో ఎక్కువగా ఉండేవారు. వారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఈ జనరేషన్‌కి పోలియో మహమ్మారి గురించి పెద్దగా తెలియదు. ఏ రూపంలో అది జీవించి ఉన్నా, మనుషుల్లోకి రావడం తేలికే. అందుకే కెసియార్‌ ప్రభుత్వం ఇంతలా భయపడుతోంది. ఇది తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌కే ఇబ్బంది తెచ్చే అంశం కూడా.