రాజమౌళి వరల్డ్ సెన్సేషనల్ మూవీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమా దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఎనభైశాతం షూటింగ్ పూర్తయ్యింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లే. ‘బాహుబలి’ తొలి పార్ట్‌ని మించిన అంచనాలతో ఈ సినిమా రాబోతోంది. తొలి పార్ట్ క్రియేట్ చేసిన సెన్సేషన్ వల్లే ఈ సినిమాలో మరిన్ని హంగులు జోడించాడు జక్కన్న. అనుష్క, తమన్నా, ప్రభాస్, రానా ముఖ్య పాత్రల్లో వస్తోన్న ఈ సినిమాకి ఏప్రిల్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ షూటింగ్ పనులు ఆలోగా పూర్తి కావనే ఉద్దేశ్యంతో ఈ సినిమా డేట్ మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయని రూమర్స్ వచ్చాయి.
కానీ ఇప్పటికే ఈ సినిమా చాలా లేటు కావడంతో ఇక ఆలస్యం చేయకూడదనే ఉద్దేశ్యంతో షూటింగ్ పనులు మరింత వేగవంతం చేశాడట జక్కన్న. దాంతో అనుకున్న టైంకే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడట. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే విషయంపై అతి త్వరలో ప్రపంచం మొత్తానికి క్లారిటీ వచ్చేయనుందన్న మాట. ఇంకోవైపున ‘బాహుబలి’ షూటింగ్ పూర్తయితే తప్ప, గెటప్ ఛేంజ్ చేయడానికి వీల్లేదు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ప్రభాస్, రాణాలకి. తదుపరి సినిమాలు ఒప్పుకోవాలంటే వీరిద్దరికీ ‘బాహుబలి’ పూర్తవ్వాలి. ‘బాహుబలి’ పూర్తయిన వెంటనే ప్రభాస్, వరుసగా రెండు సినిమాల్ని పట్టాలెక్కించనున్నాడని సమాచారమ్.