సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద పండగ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ చేయాలని అంత ఆరాటపడుతూ ఉంటారు. ఏడాదిలో వచ్చే మొదటి పండుగలు సినిమా రిలీజ్ చేసి సక్సెస్ అందుకుంటే.. ఏడాది అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయని నమ్ముతారు. అలా ప్రతి సంవత్సరం పెద్ద సినిమాలు సీజన్‌లో రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. కాగా 2025 సంక్రాంతి బరిలో అలా మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజై సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. ప్రత్యేకించి ఈ సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు గట్టి పోటీ ఇచ్చాయి.
గేమ్ ఛేంజర్:
రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమానే రూ.100కోట్లు టచ్ చేసింది. రెండో రోజు కే రూ.100 కోట్లు కొటగొట్టడం విశేషం. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి.. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయి.. అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ రికార్డ్‌ను గేమ్ ఛేంజర్ సొంతం చేసుకుంది. కానీ.. టాక్ మాత్రం యావరేజ్‌గా ఉండడంతో.. వసూళ్లపై కాస్త ప్రభావం చూపిందనే చెప్పాలి.
సంక్రాంతికి వస్తున్నాం :
సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడో రోజుకు రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం విశేషం. అతి తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడం అంటే.. వెంకీ కెరీర్ లోనే ఇదొక రేర్ ఫీట్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షోతోనే ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు మరింత బలమైంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ సినిమా హవా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్ల రికార్డులు చూస్తుంటే.. వెంకీ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టే సినిమాగా ఈ సినిమా రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం బుకింగ్స్ లో కూడా మిగతా రెండు సినిమాల కంటే ఎక్కువ బుకింగ్స్ ను చేసుకుంటూ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
డాకు మహారాజ్:
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా.. నాలుగో రోజున రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది బాలయ్య మాస్ ఫాలోయింగ్ ఎలా ఉందో మరోసారి ఆడియన్స్ కు రుజువైంది. ఆరంభంలోనే మంచి ఆక్యుపేసి తో రికార్డులు క్రియేట్ చేసిన డాకు మహారాజ్.. ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకోవడం తో నాలుగవ రోజుకే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డును క్రియేట్ చేసింది. అంతే కాదు.. బాలయ్య కెరీర్‌లో వరుసగా నాలుగో సారీ రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. ఇలా మూడు సినిమాలు అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు క్లబ్ లోకి చేరడం అసలైన స్పెషాలిటీ.