హీరో సిద్ధార్థ తాజాగా నటించిన మూవీ.. మిస్ యూ. ఆశిక రంగనాథన్ హీరోయిన్గా కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు. కేజీ వెంకటేష్ సినిమాటోగ్రఫర్‌గా, దినేష్ ఎడిటర్ గా.. 7 మైల్స్ ఫర్ సెకండ్.. బ్యానర్ పై ఎస్.రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. ఇక సినిమా 13-12-2024 రిలీజ్ అయింది.
పరిచయం:
లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన్న సిద్ధార్థ్.. కొత్త తరం కథలతో అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. మధ్యలో భిన్నమైన జాలర్లో పలు సినిమాలలో నటించినా.. తనకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు మాత్రం విడవకుండా కుదిరినప్పుడల్లా.. ఆ జోనర్ కథలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అందులో భాగంగానే తాజాగా నటించిన మూవీ మిస్ యూ. ఇంతకీ సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా.. చూద్దాం.
కథాంశం:
వాసు (సిద్ధార్థ్) దర్శకుడు కావాలని కలలుగానే యువకుడు. నిర్మాతలను కలిసి వాసు కథలు చెప్పే ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలో ప్రమాదానికి గురై తన చివరి రెండు సంవత్సరాల గతని పూర్తిగా మర్చిపోతాడు. ఇక మెల్లగా కోలుకున్న వాసు అనుకోకుండా బాబి (కరుణాకరన్)తో కలిసి బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కేఫ్ లో పనిచేస్తున్న క్రమంలో సుబ్బలక్ష్మి (ఆశిక రంగనాథన్) ని చూసి ఫస్ట్ సైట్ లోనే ప్రేమించేస్తాడు. అయితే ఆ అమ్మాయి వాసుని రిజెక్ట్ చేస్తుంది. తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పి ఎలాగైనా ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకోవాలని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు వాసు. ఆమె ఫోటో చూసినా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశ్చర్యపోతారు. సుబ్బలక్ష్మితో పెళ్లి కుదరదని.. ఆమెను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలని చెబుతారు. అయినా పట్టు వదలని వాసు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంతకీ సుబ్బలక్ష్మి ఎవరు..? అసలు ఆమెను మాత్రం పెళ్లి చేసుకోవద్దని ఫ్యామిలీ ఎందుకు అంత గట్టిగా చెప్పారు..? వాసుకి ఆమెకి గతంలో ఉన్న కనెక్షన్ లాంటి విషయాలు సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ:
తెలుగు బ్లాక్ బస్టర్ హాయ్ నాన్న సినిమాకు దగ్గర పోలికలు ఉన్నట్టు అనిపిస్తుంది. అందులో పాప చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఒక కేసు చుట్టూ ముడిపడి కథ ఉంటుంది. మిగతాదంతా ఒకేలా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హీరో, హీరోయిన్ల పర్ఫామెన్స్ ప్రేక్షకులను మెప్పించినా.. చెప్పుకునేంత కంటెంట్ ఉన్నట్లుగా అనిపించదు. కథ, ఎమోషన్స్, అన్ని ఊహించిన విధంగానే అనిపిస్తాయి, సాంగ్స్ అనవసరంగా సినిమాను సాగదీసి ఎందుకు పెట్టినట్లు ఉంది, నడివి 2 గంటల 6 నిమిషాలు అయినా.. థియేటర్లో సినిమా ఇంకా పూర్తి అవడం లేదని బోర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక ఎంట్రీ సీన్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు. స్టోరీ ట్రాక్ లో పడడానికి చాలా టైం పడుతుంది.
హీరో, హీరోయిన్లు కలిసిన తర్వాత స్టోరీ స్పీడ్ అయింది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మలచే అవకాశం ఉన్న దర్శకుడు తనపై దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది. హీరోయిన్ చూడడం.. వెంటనే ఆమెకు లవ్ ఎక్స్ ప్రెస్ చేయడం.. ఆమె రిజెక్షన్ ఇలా అన్ని వెంట వెంటనే జరిగిపోతాయి. సుబ్బలక్ష్మితో ప్రేమ విషయం ఇంట్లో చెప్పినప్పుడు కథలో చోటు చేసుకునే ట్విస్ట్ మాత్రమే సినిమాకు హైలెట్. అదే సెకండ్ హాఫ్ చూడడానికి ఆసక్తి కల్పించే అంశం కూడా. ఇక ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ లో సాగే సెకండ్ హాఫ్ లో.. బ్యాడ్ మ్యారేజ్ అంటే ఏంటో చెప్పే సన్నివేశాలు, డెసిషన్స్ కలవని హీరో, హీరోయిన్ల మధ్యన సంఘర్షణ.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ.. అలాంటి సీన్స్ మరింత డెప్త్ గా చూపించలేదు అనే ఫీల్ కలుగుతుంది. మధ్యలో వచ్చే సాంగ్స్ స్టోరీని అసలు ముందుకు కదలనివ్వవు. పతాక సన్నివేశాలు అస్సలు సస్పెన్స్ లేదు. రొమాంటిక్ సీన్స్ ఇష్టపడే వారికి సినిమా అక్కడక్కడా ఆకట్టుకుంటుంది.
నటీనటుల పర్ఫామెన్స్:
సిద్ధార్థ్ తనకు అలవాటైన పాత్ర కాబట్టి 100% ఇచ్చేశారు. ఆయన నటనకి సవాల్ విసిరేంత సన్నివేశాలు ఇందులో కనిపించలేదు. ఇక ఆశికా రంగనాథ్ తెరపై సిద్ధార్థ కు మంచి జోడి అనిపించుకున్నారు. ఇద్దరి మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆశిక రంగనాథన్ నటన.. ఆమె కనిపించిన విధానం,. తన పాత్రలో ఒదిగిపోయి తీరు.. నాచురల్ నటన మెప్పిస్తుంది. జేపీ, కరుణాకర్, బాల శరవణన్, షష్టిక తదితరులు తమ పాత్రలో పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం మంచి పని తీరు కనబరిచింది. వెంకటేష్ సినిమాటోగ్రఫీ మెప్పించింది. జిబ్రాన్ మ్యూజిక్ ఆకట్టుకున్నా.. సాంగ్స్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను అసలు మెప్పించలేకపోయాయి. ఇక ఫైట్ సీన్స్ కూడా సాగదీసినట్లు అనిపించాయి. నిర్మాణ పరంగా లోటుపాట్లు కనిపించుకున్నా.. డైరెక్టర్ రాజశేఖర్ వీక్ కంటెంట్ ను తెరకెక్కించినట్లు అనిపించింది. కామెడీ, కొన్ని మలుపులు పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న.. లవ్ ఎమోషన్స్ పై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా బాగుండేదని ఫీల్ ఆడియన్స్ కి కలుగుతుంది.
ప్లస్ లు:
సిద్ధార్థ , ఆషిక జోడి సినిమాకు హైలైట్.
అక్కడక్కడ కొన్ని మలుపులు సినిమాకు ప్లస్ అవుతాయి.
మైనస్ లు:
అసలు కథలో సస్పెన్స్ ఎక్కడా లేదు.
ఎమోషనల్ సీన్స్ బలంగా అనిపించలేదు.
ఫైనల్ గా: మిస్ యు లో ఏదో మిస్సయిందన ఫీల్ వస్తుంది. అక్కడక్కడ మెప్పిస్తుంది.