సినీ ఇండస్ట్రీలో హీరోల కొడుకులు.. హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం అనేది ఎప్పుడు సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొంతమంది దర్శకుల కుమారులు కూడా హీరోలుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ హీరోలుగా దూసుకుపోతుంటే.. మరి కొంత మంది ఇంకా సక్సెస్ కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. అయితే అలా ఇండస్ట్రీలో దర్శకుల వారసులుగా అడుగుపెట్టి హీరోలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
అల్లరి నరేష్ – ఆర్యన్ రాజేష్
టాలీవుడ్ లో అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ ఇద్దరు హీరోలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే అ ఈన్న తమ్ముళ్ళు ఇద్దరు తండ్రీ దర్శకుడు ఇవీవీ సత్యనారాయణ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈవీవీ తెలుగులో ఎన్నో సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక వీరిలో ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరం కాగా.. అల్లరి నరేష్ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. మొదట కామెడీ సినిమాలతో సక్సెస్ అందుకున్న అల్లరి నరేష్.. ఇటీవల కాలంలో వైవిద్య పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
ఆకాష్ పూరి
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకుగా ఆకాష్ పూరి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా బుజ్జిగాడు సినిమాలో నటించిన ఆకాష్ పూరి తర్వాత హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో ఈ యంగ్ హీరో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆకాష్ చివరిగా రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో తనయుడి సక్సెస్ కోసం పూరి జగన్నాథ్ కూడా భాగమయ్యాడు. లకిడికపూల్ అంటూ ఓ పాట రాసి ఆలపించారు.
గోపీచంద్
మొదట విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ తండ్రి కూడా ఓ దర్శకుడు అన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. గోపీచంద్ తండ్రి టీ. కృష్ణ.. నేటి భారతం, దేశంలో దొంగలు, ప్రతిఘటన లాంటి పలు సినిమాలు దర్శకుడుగా వ్యవహరించారు. అంతేకాదు ఈ సినిమాలకు ఆయనే నిర్మాత కూడా. ఇక డైరెక్టర్ తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా గోపీచంద్ కు సరైన సక్సెస్ లేదు.
సంతోష్ శోభన్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తండ్రి కూడా ఒకప్పటి డైరెక్టర్. వర్షం, బాబి, రవితేజ చంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శోభన్ కుమారుడే సంతోష్ శోభన్. గతంలో పేపర్ బాయ్, ఏక్ మినీ కథ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సంతోష్ శోభన్.