టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే.. ఇంద్ర సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. బి.గోపాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా రేపు పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాపై హీరోయిన్ సోనాలి బింద్ర రియాక్ట్ అయింది. ఇంద్ర షూటింగ్ టైంను గుర్తు చేసుకుంటూ.. ఆమె చేసిన కామెంట్లు వైరల్‌గా మారుతున్నాయి. వైజయంతి బ్యానర్‌లో చేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని.. అది ఓ గొప్ప అనుభూతి.. అశ్వినీ దత్త్ చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మెగాస్టార్ తో నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని.. ఇంద్రాలో అన్నిటికంటే కష్టమనిపించిన పని ఆయనతో కలిసి డాన్స్ చేయడమే అంటూ చెప్పుకొచ్చింది.
ఆయనతో సమానంగా డ్యాన్స్ వేయడం ఎవరికీ సాధ్యం కాదంటూ వివరించిన సోనాలి.. మరిసటి రోజు దాయి దాయి దమ్మా పాట షూటింగ్ ఉందని చెప్పడంతో ఆ నైట్ అంతా భయంతో నిద్రపోలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆ పాటలో చిరంజీవి అద్భుతంగా ఆకట్టుకున్నారని.. ఆయనను చూసి ఆశ్చర్యపోయానంటూ వివరించింది. నన్ను కూడా వీణ స్టెప్ వేయమంటారేమో అని భయపడ్డా.. రాదే గోవిందా.. ప్రేమే పుట్టిందా.. పాట షూటింగ్ కూడా ఎంతో ఎంజాయ్ చేశా అంటూ చెప్పుకొచ్చింది.
హైదరాబాద్‌లో వేసిన పెద్ద సెట్‌లో ఈ సాంగ్ షూట్ చేశారని.. చిరంజీవి ఫ్యామిలీ అంతా ఆ టైంలో సెట్స్ లోనే ఉన్నారంటూ వివరించింది. ఇక ఇంద్ర సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ.. చిరంజీవి అభిమానులకు ఇది పెద్ద పండుగ అంటూ.. సోనాలి బింద్రే వివరించింది. ఇక తాజాగా రీరిలీజ్ గురించి చిరంజీవి కూడా స్పందించారు. ఆయన సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ మూవీ ఇంద్ర అంటూ వివరించారు. ఈ తరం వాళ్లకి ఇంద్ర బిగ్ స్క్రీన్ పై చూపించాలనే ఆలోచన చేసిన స్వప్న దత్త్, ప్రియాంక దత్తులకు హృదయపూర్వక అభినందనలని ఆయన చెప్పుకొచ్చారు.