రామ్ చ‌ర‌ణ్ ముద్దుల కూతురికి `క్లిన్‌ కారా` పేరును సూచించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా లిటిల్ ప్రిన్సెస్ జన్మించడంతో రామ్ చరణ్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూన్ 20వ తేదీన అపోలో హాస్పటల్ ఉపాసన డెలివరీ జరిగింది. ప్రసవం అయిన మూడో రోజే ఉపాసన డెశ్చార్జ్ అయ్యింది.

ఇకపోతే జూన్ 30వ తేదీన రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురికి బార‌సాల‌ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో మెగా లిటిల్ ప్రిన్సెస్ కు `క్లిన్‌ కారా` అని నామకరణం కూడా చేశారు. పాప పేరును మొద‌ట మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేశారు. ఈ పేరును లలితా సహస్రనామం నుండి తీసుకున్నారు. ఈ పేరు ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే పరివర్తన, శుద్ధి చేసే శక్తిని సూచిస్తుంది. అయితే రామ్ చ‌ర‌ణ్ ముద్దుల కూతురికి `క్లిన్‌ కారా` అనే పేరును సూచించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా.. ఉపాస‌న త‌ల్లి శోభనా కామినేని.

అవును, ఈ విష‌యం శోభ‌నా కామినేని తాజా పోస్ట్ తో బ‌య‌ట‌కు వ‌చ్చింది. `ఉపాసనా నువ్వు పుట్టినప్పుడు నీకు క్లిన్ కారా అని పేరు పెట్టాలనుకున్నాను, కానీ ప‌లు కార‌నాల వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అదే పేరు నీ కూతురికి పెట్టావు. చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్- ఉపాసనలకు అభినందనలు, మీ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి. మేము నిన్ను ప్రేమిస్తున్నాము కారా` అని తన మనవరాలి బారసాల వేడుకలకు సంబంధించిన ఫొటోలను శోభ‌నా షేర్‌ చేసింది. దీంతో త‌ల్లి సూచించ‌డం వ‌ల్లే ఉపాస‌న కూతురికి క్లిన్ కారా పేరు పెట్టింద‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది.