ఘ‌నంగా రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురి బార‌సాల వేడుక‌.. మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవ‌ల పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో ఉపాస‌న డెలివ‌రీ జ‌రిగింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ జ‌న్మించ‌డంతో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌తో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నేడు రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురు బార‌సాల వేడుక ఘ‌నంగా జ‌రిగింది.

త‌మ డార్లింగ్ కు నామ‌క‌ర‌ణం చేయ‌బోతున్నామ‌ని ఈ రోజు ఉద‌య‌మే ఉపాస‌న తెలిపింది. అలాగే ఈ వేడ‌క కోసం త‌మ ఇంటిని డెక‌రేట్ చేస్తున్న వీడియోల‌ను కూడా పంచుకుంది. అయితే తాజాగా ఈ బార‌సాల వేడుక పూర్తైంది. చిరంజీవి మ‌న‌వ‌రాలి పేరును అనౌన్స్ చేశారు. మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు `క్లిన్ కారా కొణిదెల`.

ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం నుంచి ఈ పేరును తీసుకున్నారు. క్లిన్ కారా అంటే ప్రకృతి మరో రూపం అని అర్థం వ‌స్తుంది. ఆ పేరులో ఒక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్ ఉందని.. ఈ లక్షణాలని మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వతంలో పెరిగేకొద్దీ ఇమడ్చుకుంటుందని నమ్ముతున్నట్లు చిరంజీవి తెలిపారు. దీంతో పాప పేరు బాగుందంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక బార‌సాల వేడుక‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.