ట్విట్టర్‌ టాక్‌.. మిస్‌ ఫైర్ అయిన‌ `ఏజెంట్‌` ఆపరేషన్!

అఖిల్ అక్కినేని, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `ఏజెంట్‌`. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తే.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సినిమా నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో ప‌లు చోట్ల షోలు ప‌డిపోయాయి. సినిమా చూసిన ప్రేక్ష‌కులు ట్విట్ట‌ర్ ద్వారా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అయితే చాలా వ‌ర‌కు నెగ‌టివ్ రివ్యూలే రావ‌డం గ‌మ‌న్నార్హం. కంప్లీట్ ఔట్‌డేటెడ్ స్టోరీతో సురేంద‌ర్‌రెడ్డి ఈసినిమాను తెర‌కెక్కించాడ‌ని ట్వీట్లు చేస్తోన్నారు. రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమా ఇదని అంటున్నారు. రా ఆఫీసర్‌ మమ్ముట్టి ఓ మాఫియా ముఠాని పట్టుకోవడంలో విఫలమైతే, వాళ్లని పట్టుకోవడానికి అఖిల్ ప‌ర్ఫెక్ట్ అని భావించి, ఆ ఆపరేషన్‌ ని అఖిల్‌కి అప్పగిస్తారు.

కొంటె ప్రవర్తన కలిగిన అఖిల్ ఆ మాఫియా ముఠాని ఎలా పట్టుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. అయితేయాక్ష‌న్ సీక్వెన్స్ మిన‌హా సినిమాలో ఆక‌ట్టుకునే అంశాలు ఏమీ లేవ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏజెంట్‌ ఆపరేషన్‌ మిస్‌ ఫైర్‌ అంటున్నారు. అఖిల్‌ యాక్షన్‌ పరంగా మెప్పించినా..నటనతో ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు. ఫస్టాఫ్‌ కొంత ఫర్వాలేదట. కానీ సెకండాఫ్‌, క్లైమాక్స్ దారుణంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. సాంగ్స్‌, బీజీఎమ్ తో పాటు వీఎఫ్ఎక్స్‌ ఈ సినిమాకు పెద్ద మైన‌స్ అనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. హీరోహీరోయిన్ల ల‌వ్‌ట్రాక్ బోర్ కొట్టించిద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏజెంట్ అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అని తేల్చేస్తున్నారు. మ‌రి ఈ టాక్ తో ఏజెంట్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది చూడాలి.