నెల్లూరు ఎంపీ సీటుపై టీడీపీ పట్టు..వైసీపీ ఛాన్స్ ఇస్తుందా?

తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్ష మాదిరిగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నెల్లూరు పార్లమెంట్ కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పి పెద్దగా విజయాలు సాధించలేదు. ఎప్పుడో 1984, 1989, 1999 ఎన్నికల్లో మాత్రమే అక్కడ టి‌డి‌పి గెలిచింది..మళ్ళీ ఆ తర్వాత గెలిచిన సందర్భాలు లేవు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో గెలుపు వరకు వచ్చి బోల్తా కొట్టింది.

ఆ ఎన్నికల్లో కేవలం 13 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయింది. వైసీపీ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలిచారు. టి‌డి‌పి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా టి‌డి‌పి ఓటమి పాలైంది. వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగగా, టి‌డి‌పి నుంచి బీద మస్తాన్ రావు పోటీ చేశారు. దాదాపు లక్షా 48 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయింది. ఇక ఇటు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీదా మస్తాన్ రావు టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వెళ్ళిపోయారు.

దీంతో నెల్లూరు పార్లమెంట్ లో టి‌డి‌పికి సరైన నాయకుడు లేరు. అయితే నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడుగా అబ్దుల్ అజీజ్ మాత్రం పనిచేస్తున్నారు. కానీ పార్లమెంట్ స్థాయిగా తగ్గ నేత కాదు..దీంతో ఆయనని బరిలో దించే అవకాశాలు లేవు. అయితే ఇప్పుడుప్పుడే నెల్లూరులో టి‌డి‌పి పుంజుకుంటుంది. వైసీపీ నుంచి ముగ్గురు బలమైన ఎమ్మెల్యేలు బయటకొచ్చారు. అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టి‌డి‌పి పుంజుకుంటుంది.

పార్లమెంట్ పరిధిలో కందుకూరు, కోవూరు, కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, ఆత్మకూరు సీట్లు ఉన్నాయి. ఆత్మకూరు, కందుకూరు మినహా మిగిలిన సీట్లలో టి‌డి‌పి బలం పుంజుకుంది. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచుకునేలా ఉంది. అదే జరిగితే నెల్లూరు ఎంపీ సీటుని సైతం టి‌డి‌పి కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది.