టీడీపీలోకి కోటంరెడ్డి తమ్ముడు..రూరల్‌లో ఫస్ట్ ఛాన్స్!

వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి ఇంకా వలసలు జోరు అందుకునేలా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీని కాదని కొందరు నేతలు టి‌డి‌పి వైపుకు వస్తున్నారు. అంటే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ వైపుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టి‌డి‌పికి దగ్గరైన విషయం తెలిసిందే.

వైసీపీలో తనపై నిఘా పెట్టడం, ఫోన్లు ట్యాప్ చేయడం, అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోవడ లాంటి అంశాలతో కోటంరెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఆయన దూరమైన వెంటనే నెల్లూరు రూరల్ కు ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో కోటంరెడ్డి పూర్తిగా వైసీపీకి దూరమయ్యారు. ఇప్పటికే ఆయన టి‌డి‌పిలో చేరాలని ఉందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు దగ్గర నుంచి కొన్నాళ్ళ పాటు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడు టి‌డి‌పి చేరడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

పైగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటంరెడ్డి..టి‌డి‌పి అభ్యర్ధికే ఓటు వేశారు. ఆ ఎన్నిక అయిన వెంటనే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టి‌డి‌పిల చేరడం ఖాయమైంది. అయితే ఎమ్మెల్యేగా ఉండటం వల్ల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారికంగా టి‌డి‌పిలో చేరే అవకాశం లేదు.

మొదట ఆయన సోదరుడుని టి‌డి‌పిలోకి పంపించి..ఎన్నికల ముందు ఆయన టి‌డి‌పిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కోటంరెడ్డి చేరికతో నెల్లూరు రూరల్ లో టి‌డి‌పికి పట్టు పెరుగుతుందనే చెప్పాలి. తొలిసారి టి‌డి‌పికి అక్కడ గెలిచే అవకాశం కూడా వస్తుందనే చెప్పాలి.