రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని నేను ఇక్కడకి రాలేదు: పవన్‌ కల్యాణ్‌

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. యావత్ తెలుగునాటలో ఆ పేరు ఎక్కడ విన్నా వైబ్రేషన్స్ మొదలవుతాయి. మరీ ముఖ్యంగా తెలుగు యువత ఆ పేరువింటే పిచ్చెక్కిపోతారు. అదే విధంగా నందమూరి బాలయ్య గురించి కూడా ప్రస్తావన అనవసరం. నందమూరి అభిమానులకు బాలయ్య అంటే ఇంట్లో మనిషి లెక్క. ఇక బాలయ్య హోస్టు చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో హై రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ షోలో పలువురు సూపర్ స్టార్స్, రాజకీయ నాయకులు పాల్గొనగా తాజాగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే పవన్ మొదటి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కాగా తాజాగా రెండో ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. ఈ ప్రోమో చూస్తుంటే పవన్ తన లైఫ్ లో జరిగిన కీలక విషయాలు చెప్పినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. తొలి ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ వ్యక్తిగత – సినిమా జీవితం పైన ఫోకస్ చేసిన బాలకృష్ణ రెండో ఎపిసోడ్ లో రాజకీయ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కొసమెరుపు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయాల విషయమై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు న భూతొ న భవిష్యతి. బాలయ్య పవన్ కళ్యాణ్ ని అడుగుతూ… ‘నీపై అభిమానుల అభిమానాన్ని ఓటు రూపంలో ఎందుకు మార్చుకోలేకపోయారని?’ ప్రశ్నించగా…. పవన్ స్పందిస్తూ, సినిమా జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. సినిమాలలో పేరు రావడం వెనుక నా కష్టం వుంది, అదే విధంగా రాజకీయాల్లోనూ అదే స్థాయిలో పేరు రావాలంటే అంతే కష్టపడాలన్నారు. రాత్రికి రాత్రి అద్భుతాలు అయితే జరగవని కూడా వివరించారు. తాను ఇంకా నమ్మకం సంపాదించుకొనే స్థితిలోనే ఉన్నానని పవన్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.