గొప్ప‌ మ‌న‌సు చాటుకున్న బ‌న్నీ.. ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్న నెటిజ‌న్స్‌!

మ‌న టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ సేవా కార్య‌క్ర‌మాల్లో ముందు ఉంటారు. తమకు వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు పెడుతుంటారు. అలాగే అభిమానులు ఇబ్బందుల్లో త‌మ వంతు సాయం చేసి అండంగా నిల‌బ‌డుతుంటారు. తాజ‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గొప్ప మనసు చాటుకున్నాడు. రీల్ లోనే కాదు రియ‌ల్ గానూ తాను హీరో అని నిరూపించుకున్నాడు.

ఫ్యాన్స్ కు కష్టం వచ్చిందంటే ఎప్పుడూ ముందుండే అల్లు అర్జున్.. తాజాగా ఓ అభిమాని తండ్రికి వైద్యం చేయించాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అర్జున్ కుమార్ అనే ఓ అభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించడానికి దాదాపు రెండు లక్షల వరకు కావాల్సి ఉండగా.. అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొందరు బన్నీ అభిమానులు అర్జున్ కుమార్ తండ్రి పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

గీత ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడు ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ‌న్నీ.. అర్జున్ కుమార్ తండ్రి వైద్యానికి అవ‌స‌రం అయ్యే మొత్తం ఖ‌ర్చును తాను భ‌రిస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ట‌. స‌ద‌రు అభిమాని తండ్రికి మెరుగైన వైద్యాన్ని చేయించాడ‌ట‌. ఈ విష‌యం తెలిసుకున్న నెటిజ‌న్లు బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బ‌న్నీ గొప్ప మ‌న‌సుకు హ్యాట్స‌ఫ్ చెబుతున్నారు.