టీపీసీసీ మార్పు..రేవంత్‌కు ఎసరు..దిగ్విజయ్ తేల్చేశారు.!

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి…కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలపై ఫైట్ చేయడం, విమర్శలు చేయడం చేస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయం మారిపోయింది. పైగా ఇటీవల పి‌సి‌సి పదవుల పంపకాల విషయంలో పెద్ద రచ్చ నడిచింది. సీనియర్లని పట్టించుకోకుండా పదవులని భర్తీ చేశారని, టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు ఎక్కువ ఇచ్చారని, పైగా సీనియర్లపై కోవర్టులు అని ముద్ర వేసి ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్, భట్టి లాంటి ఫైర్ అయ్యారు.

సేవ్ కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకెళుతున్నారు. అటు రేవంత్ వర్గం పదవులకు రాజీనామాలు చేసి సీనియర్లకు కౌంటర్ ఇచ్చింది. దీంతో రచ్చ పెరిగింది. ఇదే క్రమంలో అధిష్టానం దూతగా దిగ్విజయ్ తెలంగాణకు వచ్చి..పరిస్తితులని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీనియర్లు మొత్తం రేవంత్, మాణిక్కం ఠాగూర్ టార్గెట్ గా…ఫిర్యాదులు చేశారని తెలిసింది. వారిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే రేవంత్ వర్గం కూడా ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది. ఇప్పటివరకు చాలామంది నేతలు పార్టీ మారిపోయారని, మరి అప్పుడు సీనియర్లు సేవ్ కాంగ్రెస్ అని ఎందుకు అనలేదని ఫైర్ అవుతున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ నడిచింది. ఇక అందరి అభిప్రాయం విన్న దిగ్విజయ్…ఎవరు వీధికెక్కకూడదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

ఇక పి‌సి‌సి మార్పు తన చేతుల్లో లేదని, కానీ ఫిర్యాదులని అధిష్టానానికి వివరిస్తానని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని కోరారు. అయితే అధిష్టానం ఇప్పటిలో రేవంత్ రెడ్డిని తప్పించే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరి ఈ విషయంలో సీనియర్లు ఎలా ముందుకెళ్తారో చూడాలి.