జోగి సీటు మళ్ళీ మారుతుందా?

ఏపీ రాజకీయాల్లో మంత్రి జోగి రమేష్ ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు..జగన్ పట్ల విధేయతతో ఉండే రమేష్..ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉంటారు..ఆ ఫైర్ తోనే మంత్రి పదవి కూడా సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ..చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళి బాగా హైలైట్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబుతో పాటు రఘురామకృష్ణంరాజుని తీవ్రంగా తిట్టి జగన్ దృష్టిలో పడ్డారు. మొత్తానికి మాత్రం మంత్రి పదవి పట్టేశారు. ఇప్పుడు మంత్రిగా..ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు.

ఇలా ఫైర్ బ్రాండ్‌గా దూసుకెళుతున్న రమేష్‌కు సొంత నియోజకవర్గంలో మాత్రం పరిస్తితులు మాత్రం అంత కలిసొచ్చేలా కనిపించడం లేదు. పెడనలో జోగిపై పాజిటివ్ పెద్దగా కనిపించడం లేదు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు గెలుపు టఫ్ అయ్యేలా ఉంది. అటు టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్ బలం పుంజుకుంటున్నారు. పైగా ఓడిపోయిన సానుభూతితో పాటు, తన తండ్రి కాగిత వెంకట్రావు చనిపోయిన సానుభూతి ఉంది. ఇదే క్రమంలో జనసేనతో గాని పొత్తు ఉంటే…డౌట్ లేకుండా పెడనలో జోగి గెలవడం జరగదని తెలుస్తోంది.

ఈ క్రామంలోనే ఆయన సీటుని మళ్ళీ మారుస్తారని కృష్ణా జిల్లా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గతంలో రెండుసార్లు ఆయన సీటు మారింది. 2009లో కాంగ్రెస్ తరుపున పెడన నుంచి గెలిచిన జోగి..తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014లో మైలవరంలో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ పెడన వచ్చి పోటీ చేసి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో మళ్ళీ ఆయన సీటు మారుతుందని అంటున్నారు.

ఎలాగో మైలవరంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై సానుకూలత లేదు. ఎలాగో అది జోగి సొంత స్థానం…మళ్ళీ అక్కడకు పంపుతారా? లేక వేరే చోటుకు పంపుతారా? అనేది క్లారిటీ రావడం లేదు. పైగా పెడన పక్కనే ఉన్న కైకలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు పాజిటివ్ పెద్దగా లేదు. కాబట్టి దూలంని తప్పించి కైకలూరుకు జోగిని పంపే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అలాగే పెడనలో ఉప్పాల రామ్ ప్రసాద్ తనయుడు రాము నిలబడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే రాము భార్య హారిక ప్రస్తుతం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అలాంటప్పుడు వారికి సీటు ఇస్తారనేది డౌటే. ఇక జోగి గట్టిగా కోరుకుంటే మళ్ళీ పెడన సీటులోనే పోటీ చేయొచ్చు…లేదా ఆయన మార్చుకోవాలని అనుకుంటే..ఆ ఆప్షన్ కూడా ఉండొచ్చు. మరి చివరికి జోగి ఎక్కడ బరిలో ఉంటారో చూడాలి.