వేణుకి కలిసి రానిది, సుమంత్ కి కలిసొచ్చింది.. ఏమిటో తెలుసా?

ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని మాత్రమే వినబడే రోజులు మారాయి. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న రేంజ్ కి మనవాళ్ళు ఎగబాకారు. మన తెలుగు సినిమాలకు దేశవిదేశాల్లో కూడా ఆదరణ దక్కుతుంది. ఒకప్పుడు హిందీ సినిమా రాజ్యమేలుతున్నవేళ హిందీ సినిమాల్లో నటించే స్టార్లను తమ సినిమాల్లోకి తీసుకుంటే బాగా మార్కెట్ చేసుకోవచ్చు అని సౌత్ లో ఉన్న దర్శక నిర్మాతలు భావించేవారు. ఇప్పుడు లెక్కలు మారాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా ఆర్టిస్ట్ లను తమ సినిమాల్లో పెట్టుకుని మార్కెట్ చేసుకోవాలని భావిస్తున్నారు ఇతర భాషలవాళ్ళు.

ఈ క్రమంలో హీరోలుగా ఇక్కడ రాణించలేకపోతున్న కొంతమంది సీనియర్ హీరోలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్ లుగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఒకప్పుడు హీరోలుగా చేసిన వేణు, సుమంత్ లు కూడా ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా మారి సత్తా చాటారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో వేణు, ‘సీతా రామం’ లో సుమంత్ కీలక పాత్రలు పోషించారు. ఎంతో గ్యాప్ తీసుకుని చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న విడుదలై ప్లాప్ అయ్యింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుదాం అనుకున్న వేణు ఆశలను దెబ్బ తీసింది ఆ మూవీ.

సుమంత్ కెరీర్ కూడా ఇంచుమించు అంతే. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ తాజాగా వచ్చిన ‘సీతా రామం’ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో సుమంత్ పాత్రని పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనలేము, నెగిటివ్ రోల్ అనలేము. కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ పాత్ర సుమంత్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. కానీ ఈ విషయంలో వేణు మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో అతని క్యారెక్టర్ బావున్నప్పటికీ సినిమా బోల్తా పడటంతో వేణుకి ఆశించినంత పేరు రాలేదు.