2023 సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోల బాక్సాఫీస్ ఫైట్ హీటెక్కిస్తోందే…!

తెలుగు చిత్ర పరిశ్రమకు బిగ్గెస్ట్ సీజన్లలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి త‌ర్వాత ద‌స‌రా సీజ‌నే అత్యంత కీలకంగా ఉంటుంది. సంక్రాంతి సీజ‌న్‌కు రెండు, మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి హిట్లు కొడుతూ ఉంటాయి. అయితే ఈ యేడాది సంక్రాంతికి టాలీవుడ్‌లో పెద్ద యుద్ధ‌మే జ‌రిగేలా ఉంది. క‌రోనా దెబ్బ‌తో గత రెండేళ్లుగా పెద్ద సినిమాలు రిలీజ్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు వ‌రుస పెట్టి క్రేజీ సినిమాలు విడుద‌లవుతున్నాయి.

ఈ సీజ‌న్లో ఇప్ప‌టికే RRR – రాధే శ్యామ్ – సర్కారు వారి పాట – భీమ్లా నాయక్ – ఆచార్య వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ హీటెక్కించేసేలా ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మైథిలాజికల్ డ్రామా ఆదిపురుష్ సంక్రాంతికి వ‌స్తోంది. ఓం రౌత్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. క్రిష్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఏఎం. ర‌త్నం ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ – టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాను కూడా సంక్రాంతి రేసులోనే నిలుపుతున్నార‌ట‌. ఈ సినిమాను దిల్ రాజు ప్రెస్టేజియ‌స్‌గా తెర‌కెక్కిస్తున్నారు.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే దిల్ రాజు నిర్మిస్తోన్న శంక‌ర్ – రామ్‌చ‌ర‌ణ్ సినిమా కూడా సంక్రాంతి రేసులోనే నిలిపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తోన్న భోళా శంక‌ర్ లేదా బాబితో చేస్తోన్న వాల్తేరు వీర‌య్య‌ల్లో ఏదో ఒక‌టి కూడా సంక్రాంతికే వ‌స్తుంద‌ని అంటున్నారు.
ఇక మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. మ‌రి ఈ భారీ క్లాష్‌లో ఎవ‌రు నిలుస్తారు ? ఎవ‌రు గెలుస్తారు ? అనేది చూడాలి.