ఆ ఒక్క ‘సీన్‌’తో కృష్ణ గారి అభిమానులు ఫైర్.!

తమ అభిమాన హీరోను తెలుగులో ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. సినిమా విడుదలైందంటే చాలు కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేస్తుంటారు. ఎవరైనా తమ హీరోను ఒక్క మాట అన్నా అంతెత్తున లేస్తుంటారు. అవసరమైతే కొట్టడానికి కూడా వెళ్తుంటారు. ఇక ఇలాంటి కారణాలతోనే మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించేందుకు మేకర్స్ కొంత వెనుకంజ వేస్తున్నారనేది వాస్తవం. ఇటీవలే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ నటించారు.

అందులో ఎన్టీఆర్ పాత్ర కంటే రామ్ చరణ్ పాత్రలోనే హీరోయిజం అధికంగా చూపించారనే విమర్శలు అభిమానుల నుంచి వచ్చాయి. ఇలాంటి వివాదమే గతంలో సూపర్ స్టార్ కృష్ణ విషయంలోనూ జరిగింది.నాగార్జున హీరోగా, సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యపాత్రలో ‘వారసుడు’ అనే సినిమాకు మురళీమోహన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా విడుదలైన తర్వాత జరిగిన పరిణామాలను ఆయన ఇటీవల మీడియాకు వెల్లడించారు.

సినిమాలోని ఓ సన్నివేశంలో కృష్ణను పట్టుకుని దురుసుగా నాగార్జున మాట్లాడే సన్నివేశం ఉందట. ఈ సినిమా విడుదల కాగానే కృష్ణ అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయని మురళీమోహన్ చెప్పాడు. అంతేకాకుండా కొందరు కొట్టడానికి కూడా వచ్చారని పేర్కొన్నాడు. తమ హీరో పాత్రను తక్కువ చేసి చూపిస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరనడానికి ఈ సన్నివేశం ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ ఆయనను ప్రశంసల్లో మురళీ మోహన్ ముంచెత్తారు. ముఖ్యంగా నిర్మాత తన సినిమా వల్ల నష్టపోతే సాయం చేసి ఆదుకుంటారని చెప్పాడు. నిర్మాతల బాగోగులను పట్టించుకోవడంలో కృష్ణ గారి తర్వాతే ఎవరైనా అంటూ ఆయనను మురళీమోహన్ ఆకాశానికెత్తేశారు.