2024 : తాడో.. పేడో తేల్చుకోవాల్సిందే..

2024 సంవత్సరంలో జరిగే ఎన్నికలు.. తాడో పేడో తేల్చుకోవాలి. అధికారమా..రాజకీయ విరామమా.. తేలేదీ అప్పుడే. పొరపాటున ఓడిపోతే అంతే.. ఇక తేరుకునే పరిస్థితి లేదు. అందుకే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి ప్రస్తుతం ఇది. టీడీపీకి అధికారం దక్కకపోతే ఆయన రాజకీయాలనుంచి వైదొలగడం పక్కనపెడితే కుమారుడు నారా లోకేష్‌ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ తండ్రి చాటు కుమారుడని లోకేష్‌కు పేరుంది. ఆ ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఇద్దరికీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమే.

ఇవన్నీ ముందుగా గమనించిన సీనియర్‌ పొలిటీషియన్‌ చంద్రబాబు విజయం కోసం అహరహరం ఆలోచిస్తున్నాడు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా ప్లాన్‌ రూపొందించుకున్నాడు. అందులో భాగంగా రాష్ట్రంలో వేర్వేరుగా మూడు చోట్ల సర్వేలు చేయిస్తున్నాడు. అందులో ఒక సర్వే ప్రశాంత్‌ కిశోర్‌ బృందానికి చెందిన రాబిన్‌ శర్మ చేస్తున్నాడట. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యేక సర్వేలు చేసి తానే సొంతంగా నిర్ణయం తీసుకొని అభ్యర్థిని ఎంపికచేయనున్నాడు. 1999 నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మరింత దృష్టి సారించాడు.

అభ్యర్థుల ఎంపికకు పలు కమిటీలను నియమించినా చివరక బాబు నిర్ణయమే పార్టీలో ఫైనల్‌. గత ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత టీడీపీలో పలువురు నాయకులు బీజేపీలో చేరిపోవడం ఒక దెబ్బ అయితే.. మరికొందరు రాజకీయంగా సైలెంటుగా ఉండిపోవడం మరో దెబ్బ. ఇక యాక్టివ్‌గా ఉన్న పలువురు నాయకులు వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు.. పార్టీలో కొత్త తరానికి బాధ్యతలు అప్పగించి నడిపించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నమంతా సీఎం సీటులో కూర్చోవడానికే..ఈ ప్రయత్నాలు అటూ ఇటూ అయితే మాత్రం రాజకీయంగా భూస్థాపితమే.