టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శివ. వర్మ కెరీర్ లో తొలి సినిమాగా వచ్చిన శివ సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ అయిపోయారు. శివ సినిమా వచ్చినప్పటినుంచి చిరంజీవి – వర్మ కాంబినేషన్లో ఒక సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే సినిమా అదిరిపోతుందని… బిజినెస్ పరంగా కూడా మంచి వసూళ్లు వస్తాయని చాలామంది అంచనాలు వేశారు. ఎంతో మంది నిర్మాతలు ఈ ఇద్దరిని కలపాలని ప్రయత్నించారు.
అయితే ఇలాంటి కాంబినేషన్ సెట్ చేయడంలో దిట్ట అయిన వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ సక్సెస్ అయ్యారు. చాలా రోజులుగా మెగాస్టార్ చిరంజీవితో ఒక డిఫరెంట్ సినిమా తీయాలన్న కోరిక వర్మకు ఉండడం… అటు చిరంజీవికి కూడా వర్మతో కలిసి పని చేయాలని ఆసక్తి ఉండడంతో వీరి కాంబినేషన్లో సినిమా సెట్ అయింది. అదే సమయంలో చిరంజీవి హిట్లర్ సినిమాలో నటించేందుకు ఎడిటర్ మోహన్ కూడా డేట్లు ఇచ్చారు. ఇటు అశ్వనీదత్ – వర్మ సినిమాకు కూడా డేట్లు ఇచ్చారు.
నెలలో పదిహేను రోజులు హిట్లర్ సినిమాకు…. మరో పదిహేను రోజులు వర్మ సినిమాకు పని చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. అదే సమయంలో వర్మ సంజయ్ దత్ – ఊర్మిళ జంటగా హిందీలో దౌడ్ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా రెండో షెడ్యూల్ లో ఉండగా సంజయ్ దత్ జైలుకు వెళ్లడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. సంజయ్ దత్ జైలు నుంచి ఎప్పుడు ? బయటకు వస్తారో తెలియని పరిస్థితుల్లో చిరంజీవితో సినిమా చేయడానికి అంగీకరించారు.
1996లో కర్ణాటకలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి – హీరోయిన్ ఊర్మిళ మధ్య ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఇంతలోనే సంజయ్ దత్ జైలు నుంచి బయటకు రావడంతో వర్మ చిరంజీవి సినిమా పక్కనపెట్టేసి దౌట్ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ లోగా హిట్లర్ సినిమా షూటింగ్ పూర్తయింది. వర్మ సినిమా కోసం మూడు నెలల పాటు ఎంతో ఓపికగా ఎదురు చూసిన చిరంజీవి ఎప్పటికీ దౌడ్ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో కాస్త చిరాకు పడ్డారు.
రామ్ గోపాల్ వర్మను నమ్ముకుని ఎన్ని నెలలు అని వెయిట్ చేయాలని అసహనం వ్యక్తం చేసిన చిరంజీవి వేరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా వర్మ – చిరంజీవి కాంబినేషన్లో రావల్సిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ కాంబినేషన్ మధ్యలో ఆగిపోవడంతో చిరంజీవి అభిమానులు ఎంతో బాధ పడ్డారు. అటు అశ్వనీదత్‌కు కూడా ఆర్థికంగా కొంత నష్టం జరిగింది.