జగన్ పై ఉద్యోగుల గుస్సా..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కారుపై, సీఎం వ్యవహారతీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వమే పట్టించుకోకపొతే ఎలా అని ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి రూపొందించిన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. దీంతో ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం వార నడుస్తోంది. నేడు.. రేపు అన్నట్లు కాలం గడుపుతుండంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నివేదిక కోసం అమరావతిలోని సచివాలయం వద్దకు బుధవారం వెళ్లిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇబ్బందులు పెట్టారు.

అదిగో.. ఇదిగో అంటూ గంటల కొద్దీ ఎదురుచూసేలా చేశారు. మధ్యాహ్నం 4 గంటలకు సచివాలయానికి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ సమీర్ శర్మతో మాట్లాడారు. అయితే ఆయన తెలివిగా.. సీఎంతో మాట్లాడి నివేదిక ఇస్తానని జగన్ ను కలవాడనికి వెళ్లారు. నేతలను ఇక్కడ ఉంచి అలా వెళ్లిన ఆయన అలాగే మాయమయ్యారు. రాత్రి 9.30 వరకు అంటే దాదాపు అయిదున్నర గంటలపాటు ఉద్యోగ సంఘ నాయకులను సచివాలయంలోనే ఉండేలా చేశారు. సారొస్తారు.. నివేదిక ఇస్తారు అని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. సీఎస్ వచ్చేవరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకు కూర్చున్నారు. అయితే సచివాలయ భద్రతా సిబ్బంది వారిని ఒప్పించి సీఎస్ తో మాట్లాడించారు. గురువారం నివేదిక ఇచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో నాయకులు వెనుతిరిగారు. అయితే.. సీఎం ను కలిసేందుకు వెళ్లిన సీఎస్ అసలు కలిశారా.. లేక కథలు చెప్పారా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. గురువారం అయినా నివేదిక అందుతుందో, లేదో చూడాలి.