చెప్పినట్టుగా చెప్పారు.. విన్నట్టుగా విన్నారు..

కొట్టినట్టుగా కొడితే.. ఏడిచినట్టుగా ఏడ్చారనే సామెత ఒకటి తెలుగునాట ఉంది. చిత్తశుద్ధి లేకుండా చేసే పనులకు ఈ సామెత అతికినట్టుగా సరిపోతుంది. తాజాగా ఏపీలో అమరావతి రాజధాని కోసం సాగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ క్రియాశీలంగా అండగా నిలుస్తుందా లేదా అనే సంగతి.. ఈ సామెతకు సరిపోయేలా ఉంది. అమరావతి రాజధాని పోరాటానికి పార్టీ నాయకులంతా మద్దతు ఇచ్చి తీరాల్సిందే అని అమిత్ షా తిరుపతి సమావేశంలో హూంకరించినట్టుగాను, అందరూ అందుకు సమ్మతించినట్టుగానూ వార్తలు వచ్చాయి. అంతే.. కమలదళం మద్దతు అనేది అక్కడితో సమసిపోయింది.

అమరావతి రాజధాని విషయంలో పార్టీ విధాన నిర్ణయం తీసుకున్న మాట నిజం. తిరుపతి సమావేశంలో పార్టీ తీర్మానం సంగతి అడిగి నిర్ధారించుకన్న తర్వాతనే.. అమిత్ షా పార్టీ శ్రేణులకు పురమాయించారు. తమ పార్టీ ఎప్పటికీ రైతుల పక్షపాతిగా ఉండాల్సిందే అన్నారు. పోరాటానికి మద్దతివ్వాల్సిందేనని సూచించారు. ఇది జరిగి నాలుగు రోజులు అవుతోంది. కానీ పాదయాత్ర మీద కమలం నీడ పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఏపీ బీజేపీ ఆ సంగతి ఇప్పటిదాకా పట్టించుకోలేదు.

ఈ వ్యవహారాన్ని చూస్తోంటే ప్రజలకు పైన చెప్పుకున్నట్టుగా రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో అమరావతి రాజధానికి వ్యతిరేక శక్తులు ఉన్న మాట వాస్తవం. పైకి తీర్మానం చేశారే తప్ప.. వారు అమరావతి పోరాటాలను చులకన చేస్తున్నారు. అమిత్ పురమాయింపుతో వారి వైఖరి మారుతుందని అమరావతి రైతులు ఆశించారు. పాదయాత్రలో కలుస్తారని కూడా అనుకున్నారు.

ప్రస్తుతం న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా సాగుతున్న రైతుల మహాపాదయాత్ర రెండురోజలుగా విరామం తీసుకుంటోంది. భారీ వర్షాలు నెల్లూరు చిత్తూరు జిల్లాలు అతలాకుతలం అయిపోతున్న నేపథ్యంలో పాదయాత్ర రైతులు విరామం ఇచ్చారు.

అయితే కమలదళం నాయకులు ఇప్పటిదాకా అమరావతికి మద్దతుగా పోరాటంలోకి రాలేదు సరికదా.. సోము వీర్రాజు ఆ సమావేశంలో అమిత్ షా మాటల గురించి.. మీకెలా తెలుసు అంటూ మీడియా వారిమీదనే కోప్పడ్డారు. అమరావతి సంగతి ఎత్తకపోయినా.. సమావేశం లీకుల గురించి ఆయన ఆగ్రహించడం గమనార్హం.

నిజానికి అమరావతి రాజధానిగా ఇష్టంలేని నాయకులు కొందరు ఏపీ బీజేపీలో కీలకంగా ఉన్నారు. అందుకు వారికి గల కారణాలు కూడా చాలా వక్రబుద్ధులతో కూడినవి. ఇతరుల మీద ద్వేషం, తమ స్వార్థ ప్రయోజనాలు కలుపుకుని.. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తున్న నాయకులు కొందరు ఏపీ బీజేపీ నిర్ణయాలను శాసిస్తున్నారు. వారి జోక్యం కారణంగానే.. ఇంకా బీజేపీ క్రియాశీల పోరాటం మొదలు కాలేదేమో అనిపిస్తోంది.

అమరావతికి మద్దతు అనేది ఆ పార్టీ సరికొత్త నాటకం కాదని నిరూపించుకోవాలంటే.. పార్టీ తీరు మారాలి. అమిత్ షా చెప్పినట్టుగా చెప్పి హస్తిన వెళ్లిపోతే.. రాష్ట్ర నాయకులు విన్నట్టుగా విని కాడి పక్కన పారేశారేమో అనే భావన కలగకుండా ఉండాలి. ప్రజలు ఆ పార్టీని నమ్మాలంటే వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.