గెలిచింది బీజేపీనా..ఈటలనా..?కమలం నేతల మదిలో అంతర్మథనం

హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిశాయి.. ఈటల రాజేందర్ విజయం సాధించాడు.. ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది.. అయినా కమలం నేతల్లో ఏదో అసంత్రుప్తి.. ఎన్నికల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీనా.. లేక ఈటల రాజేందరా అనే ప్రశ్న కమలం నాయకులకు నిద్రలేకుండా చేస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గం అంటే ఈటల.. ఈటల అంటే హుజూరాబాద్ నియోజకవర్గం.. అటువంటి చోట అనుకోకుండా ఉప ఎన్నికలు వచ్చాయి.. హోరా హోరీ ప్రచారం నిర్వహించారు.. అధికార పార్టీ తరపున హరీశ్ రావు, ఇతర మంత్రులు అక్కడే బస చేసి కారు పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టారు.. ఇక బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల అయితే అన్నీ తానై నడిపారు. టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, ఇతర నాయకులు అక్కడ ప్రచారం చేసినా ఈటల మాత్రం నియోజకవర్గం మొత్తం చెప్పులరిగేలా తిరిగాడు. టీఆర్ఎస్ అధినేత తనను ఎలా మోసం చేసిందీ.. తానెలా విధేయంగా ఉన్నది ప్రజలకు వివరించి చెప్పాడు. చివరకు ఎన్నికలు జరిగాయి.. ఈటల విజయం సాధించాడు. సీన్ కట్ చేస్తే కమలం నాయకుల్లో ఈటల గెలిచినా.. హుజూరాబాద్ సీటు బీజేపీ ఖాతాలో పడ్డా పెద్దంగా సంత్రుప్తి లేదు. ఎందుకంటే అక్కడ గెలిచింది కేవలం ఈటల రాజేందర్ మాత్రమే. బీజేపీ తరఫున పోటీచేశారంతే.. ఇండిపెండెంటుగా పోటీ చేసినా గెలిచేవాడని కొందరు బీజేపీ నాయకులు సైతం పేర్కొంటున్నారు. అందుకే ఎక్కడా పెద్దగా విజయోత్సవాలు కూడా నిర్వహించలేదు. అదే దుబ్బాక విషయం తీసుకుంటే.. రఘునందన్ పక్కా బీజేపీ వాది. ఆయన విజయం సాధించాడు. అందుకే పలుచోట్ల విజయోత్సవాలు జరిగాయి. బీజేపీ శ్రేణులు సంబరపడ్డాయి. అయితే.. ఇక్కడ సీన్ రివర్స్.

హుజూరాబాద్ నియోజకవర్గంలో సాధారణ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తను కూడా పేరుపెట్టి పిలిచే చనువు ఉంది ఈటలకు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈటల కమలం పార్టీలో ఉన్నా కారు పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం ఈటల వైపే నిలిచారని తెలుస్తోంది. ఈ విషయం టీఆర్ఎస్ నాయకులకు కూడా తెలుసు. ఇక ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం నియోజకవర్గం మొత్తం ఈటల కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. నాన్ లోకల్ లీడర్లు, కార్యకర్తలు అక్కడ నుంచి తిరుగు ముఖం పట్టడంతో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తా ఈటలకు టచ్ లోకి వచ్చారు. ఎన్నికలకు రెండు రోజులు ముందుగానే ప్రచార పర్వం ముగుస్తుంది కాబట్టి ఆ సమయాన్ని రాజేందర్ సద్వినియోగం చేసుకున్నాడు. లోపాయికారిగా కారు పార్టీ కార్యకర్తలు ఈటలకు మద్దతు తెలిపారు. అంతే.. విజయం ఆయన వశమైంది. బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచినా అధిష్టానం నుంచి పెద్దగా అభినందనలు రాలేదు. ఇప్పటికీ ఈటలను బీజేపీ ఎమ్మెల్యే అంటారు కానీ.. ఆయన బీజేపీ బలంతో గెలవలేదు. అంతే.. ఇదే నిజం..