ఏపీలో రోజురోజుకు ప‌డిపోతున్న క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన క‌రోనా.. ఫ‌స్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా మెల్ల మెల్ల‌గా కంట్రోల్ అవుతోంది.

గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 300 లోపుగానే న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మ‌రింత భారీగా త‌గ్గాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్య‌ధికంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 22 కేసుల చ‌ప్పున‌ న‌మోదు కాగా.. క‌డ‌ప జిల్లాలో ఒక్క కేసూ న‌మోదు కాక‌పోవ‌డం విశేషం.

దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 20,68,476 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో ఇద్ద‌రు మృత్యువాత ప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,428 ద‌గ్గ‌ర నిలిచింది. ఇక నిన్నొక్క రోజే 184 మంది క‌రోనా నుంచి విముక్తి పొంద‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,51,842 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 18,777 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.