`మా`లో చ‌ల్లార‌ని వేడి..ఇండస్ట్రీకి మంచిది కాదంటున్న దర్శకేంద్రుడు!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి. నువ్వా నేనా అంటూ జరిగిన మా పోరులో ప్ర‌కాశ్ రాజ్‌పై భారీ మెజారిటీతో మంచు విష్ణు విజ‌యం సాధించారు. అయితే ఎన్నిక‌లు పూర్తి అయినా `మా`లో మాత్రం వేడి చ‌ల్లార‌డం లేదు. ఎన్నికల‌ ఫలితం అనంత‌రం ప్రకాష్ రాజ్ సహా నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్ర‌స్తుతం మా అసోసియేషన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి త‌రుణంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు `మా`లో జ‌రుగుతున్న లొల్లిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘పెళ్లి సందD’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిన్న విశాఖ వ‌చ్చారు దర్శకేంద్రుడు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ..`మా` ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సిందని అన్నారు. ఇంత అలజడి సృష్టించడం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి అంతమంచిది కాదని అన్నారు. సినీ పెద్దలు అందరూ కలిసి అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక మా అధ్యక్షుడిగా ఎన్నికైన‌ విష్ణు రాణిస్తాడన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.