బాలీవుడ్ లో థియేటర్లు రీఓపెనింగ్.. ఇందులో నిజమెంత?

ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమలో ఎంతోమంది చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతే కాకుండా ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలు కరోనా దాటికి ప్రభావితం కాగా ఎక్కువగా నష్టపోయింది మాత్రం బాలీవుడ్డే. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ రావడానికి ముందు కొంచెం గ్యాప్ వచ్చిన ఆ గ్యాప్ ను బాలీవుడ్ ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయింది. ఈ ఏడాదిలో మహారాష్ట్రలో ఎప్పుడూ థియేటర్లు పూర్తిస్థాయిలో నడవలేదు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా వెండితెర లో వెలుగులు ఇంకా నిండలేదు.

ఇప్పటికే పలుచోట్ల థియేటర్లు పునఃప్రారంభం చేసిన కూడా మహారాష్ట్రలో మాత్రం కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ థియేటర్లకు తాళం వేసి ఉంచారు. అయితే త్వరలో అక్కడ గ్రహణం వీడ బోతోంది. థర్డ్ వేవ్ వచ్చే సూచనలు తక్కువగా కనిపిస్తుండటంతో మహారాష్ట్రలో థియేటర్లను తెరుచుకోవడానికి ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 22న మహారాష్ట్రలో థియేటర్లు పున ప్రారంభం కానున్నాయి.

ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ మాట్లాడుతూ బాలీవుడ్ లో భారీ చిత్రాలు రిలీజ్ చేయడానికి మంచి సీజన్ గా భావించే దీపావళికి రెండు మూడు వారాల ముందుగా అక్కడ థియేటర్లను ప్రారంభించనున్నారు. అయితే ఆక్యుపెన్సీ ఎంత అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అక్టోబర్ లో కరోనా ప్రభావం పెద్దగా లేకపోతే నూరు శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లను తెరిచే అవకాశం ఉంది. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే మాత్రం ఆక్యుపెన్సీ తగ్గడమే కాకుండా థియేటర్లను పునః ప్రారంభించే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు.