నాన్న బాటలో.. పాదం కదపనున్న షర్మిల..

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి.. తాను ఆషామాషీగా పార్టీ పెట్టలేదని.. వైఎస్ షర్మిల రాష్ట్రప్రజలకు నిరూపించబోతున్నారు. జననేతగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జనం హృదయాల్లో గుర్తింపు ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే అడుగులు కదపనున్నారు. అచ్చంగా వైఎస్ తరహాలోనే షర్మిల కూడా చేవెళ్ల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించడానికి షెడ్యూలు కూడా ప్రకటించారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన తర్వాత షర్మిల చురుగ్గా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ప్రతిమంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను చేస్తున్నారు. తాజాగా ఆమె దీక్షకు అనుమతి ఇచ్చిన పోలీసులు, తర్వాత స్థలం మార్చాలంటూ హుకుం జారీ చేయడంతో అది పెద్ద రాద్ధాంతం కూడా అయింది. షర్మిలకు వస్తున్న మైలేజీ చూసి.. కేసీఆర్ సర్కారు భయపడుతోందని.. అందుకే అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా వాటిని రద్దు చేసి.. తమను ఇబ్బంది పెడుతున్నారని షర్మిల అనుచరులు పెద్ద యాగీ చేశారు. నిజానికి ఇలాంటి అతిశయోక్తులు వారి పార్టీకి ప్రస్తుతం ఉన్న బలానికి చాలా ఎక్కువే గానీ.. తెలంగాణ వ్యాప్తంగా ఆమె పాదయాత్ర చేయదలచుకున్న తీరు మాత్రం.. పరిశీలకుల్ని ఆకర్షిస్తోంది.

2004 ఎన్నికలకు పూర్వం వైఎస్ రాజశేఖర రెడ్డి సాగించిన పాదయాత్ర ఆయనకు ఎంత గొప్ప మైలేజీ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. తిరుగులేని మెజారిటీతో ఆయన అధికారంలోకి వచ్చారు. వైఎస్ అంటేనే చేవెళ్ల ఒక సెంటిమెంటుగా మారిపోయింది.

అలాంటి చేవెళ్ల నుంచి ఇప్పుడు షర్మిల కూడా తన పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. అయితే తండ్రి లాగా చేవెళ్ల సెంటిమెంటు తనయకు కూడా లాభిస్తుందా? ఆమెను అధికార పీఠం మీదికి తెస్తుందా? లేదా నిరాశపరుస్తుందా? అనేది ఖచ్చితంగా తేల్చిచెప్పలేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతాలు జరిగితే తప్ప ఆమె ఆశలు నెరవేరే అవకాశాలు తక్కువనే అనాలి.

తెలంగాణలో ప్రస్తుతానికి రాజకీయ వాక్యూమ్ లేదు. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. రోజురోజుకూ బలపడుతూ.. సుస్థిరమైన పాలననే అందిస్తూ సాగుతోంది. ప్రతిపక్షాలు నామమాత్రంగా ఏమీ లేవు. భారతీయ జనతా పార్టీ అధికారానికి ప్రత్యామ్నాయం అన్న స్థాయికి ఇంకా ఎదగలేదు గానీ.. బలంగానేఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత.. కాంగ్రెస్ కు కూడా ఒక మోస్తరు ఊపు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంతరించిపోయిన మాట వాస్తవం. అయితే.. రాజకీయ వాక్యూమ్ లేని తెలంగాణలో షర్మిల అడుగు పెట్టి.. పాదయాత్ర చేసినంత మాత్రాన ఏం సాధిస్తారనేది మాత్రం ప్రశ్నార్థకమే.