న్యాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం..ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
హైదరాబాద్ – నోవాటెల్ హోటల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల ఈ ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా తన సినిమా థియేటర్లు కాకుండా, ఓటీటీలో విడుదల చేయడంపై, తనని బ్యాన్ చేయాలనే వాదనలపై నాని స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. `పరిస్థితులన్నీ బాగుండి, జనం థియేటర్ కి వస్తే, అప్పుడు కూడా నేను థియేటర్లో కాకుండా ఓటీటీలోనే తన సినిమాని విడుదల చేస్తే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు, నన్ను నేనే బ్యాన్ చేసుకుంటానని` నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అలాగే తాను సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమాలో భాగమని, వారున్న పరిస్థితుల్లో తనపై విమర్శలు చేయడం నేను తప్పుబట్టడం లేదని..కానీ, నన్ను బయటి వాడిలా ట్రీట్ చేయడంమే బాధ కలిగించిందని నాని చెప్పుకొచ్చాడు. కాగా, టక్ జగదీష్ ఓటీటీ విడుదలపై మొన్నీ మధ్య డిస్ట్రిబ్యూటర్లు నానిపై తీవ్రంగా ఫైర్ అయిన విషయం తెలిసిందే. ప్రెస్ మీట్ పెట్టి మరీ నాని సినిమాలు బ్యాన్ చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు సారీ చెప్పడంతో గొడవ సద్ధుమణిగింది.