ఆ ఎంపీ మహా పిరికి.. అయినా ఓవరాక్షన్ జాస్తి..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు.. తనకు లక్షలాది మంది ప్రజల ఫాలోయింగ్ ఉన్నదని.. తాను పోస్టులు పెడితే లక్షలాది మంది ఎగబడి చూస్తుంటారని.. ఈ రాష్ట్రంలో తనకున్నంత సోషల్ మీడియా ఫాలోయింగ్ మరే యితర నేతకూ లేదని చాలా తరచుగా చెప్పుకుంటూ విర్రవీగుతూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆయనకున్న ఫాలోయింగ్ మొత్తం.. ముఖ్యమంత్రి జగన్ ను తీవ్రంగా ద్వేషించే.. తెలుగుదేశం పార్టీకి చెందిన అతివాదులు మాత్రమే అనే సంగతి ఆయనకు తెలిసినా ఒప్పుకోరు. పేరుకు రాజుగారే అయినా.. మహా పిరికి తనానికి నిలువెత్తు ప్రతీక అయిన రఘురామక్రిష్ణ రాజు.. మాటలు మాత్రం కోటలు దాటుతుంటాయి. ఓవరాక్షన్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదని నిరూపిస్తూ ఉంటారు!

తాజాగా- సుదీర్ఘకాలం బహుశా కోట్ల రూపాయల మొత్తంలోనే ఫీజులు చెల్లించి ఆయన నడిపిన కోర్టు పిటిషన్ గంగలో కొట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఆయన చేసిన విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. అలా అడగడంలో, అందుకు చూపిన కారణాల్లో అర్థం లేదని పేర్కొంది. కోర్టు చాలా విపులంగా కారణాలను విశ్లేషించింది. అయినా రాజుగారికి మాత్రం గీర తగ్గలేదు. హైకోర్టుకు వెళతా.. అక్కడకూడా సరైన తీర్పు వస్తుందనే నమ్మకం నాకు లేదు. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు వెళతా.. అంటూ తన రాబోయే కాలుపు భవిష్య ప్రణాళికను ఆయన ప్రకటించేస్తున్నారు.

రఘురామక్రిష్ణ రాజు ఎంతటి పిరికివాడంటే.. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మొహం చూపించే శక్తి కూడా ఆయనకు లేదు. సవాళ్లు విసురుకోవడానికి మాత్రం.. మొత్తం వైఎస్సార్సీపీ పార్టీ అంతటినీ ముప్ప తిప్పలు పెట్టగలనంటారు. కానీ.. తన నియోజకవర్గంలో అడుగు పెట్టరు. భయం! తన మీద హత్యాప్రయత్నం జరుగుతుందని, తనను మిగలనివ్వరని, తన పార్టీ నాయకులే తన మీద కుట్ర చేస్తున్నారని అంటుంటారు.

హత్య చే యదలచుకున్న వాళ్లుంటే కేవలం.. నియోజకవర్గానికి వస్తే మాత్రమే చేస్తారా? అ తరహా లాజికల్ ప్రశ్నలకు ఆయన వద్ద జవాబుండదు. సోషల్ మీడియాలో చెలరేగిపోయే నేలబారు కుర్రకారు లాగా.. అవాకులూ చెవాకులూ పేలడంలో ఆయన దిట్ట. తనకు టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి కీడు చేయడానికి ఆయన దిగజారారు సరే.. ఓట్లు వేసి.. ఆయనను లోక్ సభకు పంపిన ప్రజల గురించి అయినా పట్టించుకోవాలనే స్పృహ ఆయనకు ఎప్పటికీ ఉండదు. జగన్ అభిమానుల్ని తీవ్రవాదుల్లాగా అభివర్ణిస్తూ.. ప్రజలకు మొహం చాటేస్తూ నగరాల్లో మాత్రం, అది కూడా బీభత్సమైన సెక్యూరిటీ వలయం మధ్య బతుకు గడుపుతూ ఉండే ఈ పిరికి ఎంపీ.. డైలాగులు మాత్రం మహా గొప్పగా వల్లిస్తారు. సీబీఐ కోర్టులో దక్కిన ఓటమికి కిమ్మనకుండా కూర్చోవాల్సింది బదులు.. హైకోర్టుకు సుప్రీం కోర్టుకు వెళతా అని బీరాలు పలకడం చూసి పలువురు నవ్వుకుంటున్నారు.