మోడీ సర్కార్ కు సోనూసూద్ ఫోబియా ఉందా?

September 16, 2021 at 5:25 pm

కాలం కాని కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎవరిమీదనైనా దాడులు నిర్వహించారంటే గనుక.. ఖచ్చితంగా అది రాజకీయ కక్ష సాధింపు చర్యలే అనే నిశ్చితాభిప్రాయం ఈ దేశ ప్రజలందరిలోనూ ఏర్పడిపోయింది. పైగా కేంద్రప్రభుత్వం తమకు కిట్టని వారిని వేధించడానికి, లొంగదీసుకోవడానికి, బెదిరించడానికి, కిమ్మనకుండా చేయడానికి ఎంచుకునే అస్త్రంగా ఐటీ దాడులకు అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు సినీనటుడు సోనూసూద్ కు చెందిన బొంబాయిలోని నివాసం మీద, లక్నోలోని కంపెనీ మీద ఐటీ దాడులు జరిగాయి. ఇవి కూడా ఆయనను తమ దారిలో పెట్టడానికి కేంద్రం చేస్తున్న బెదిరింపు చర్యలే అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. చూడబోతే మోడీ సర్కారులో ‘సోనూ సూద్ ఫోబియా’ పుష్కలంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సోనూసూద్ కరోనా కాలంలో సరికొత్త దేవుడిగా అవతరించాడనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా ప్రతి మూలా.. సోనూసూద్ వితరణ ఫలాలను చవిచూసిన ప్రజలు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ దక్కనంత తిరుగులేని ప్రజాభిమానం సోనూకు దక్కింది. నాయకులకు వ్యతిరేకులు, అభిమానులు కూడా ఉంటారు. కానీ సోనూసూద్ కు కేవలం అభిమానులే. ఇంతటి తిరుగులేని ప్రజాభిమానం చూసి ఓర్వలేని వారు తయారుకావడం సహజం. సోనూసూద్ వితరణశీలత వెనుక ఉన్న ప్రచ్ఛన్న హస్తాల గురించి అనేక అర్థంలేని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.

అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఆదాయపు పన్ను అధికారులు సోనూసూద్ నివాసంపై దాడులు చేయడం ఒక ఎత్తు. అది కూడా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం.. ప్రారంభించిన దేశ్ కే మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడానికి సోనూ ఒప్పుకున్న తర్వాతే ఈ దాడులు జరగడం అనుమానాలను మరింతగా పెంచే వ్యవహారం.

ఢిల్లీ రాష్ట్ర పీఠం మీద కమలదళం కన్నుంది. కానీ గెలుచుకోవడం వారి వల్ల కావడం లేదు. కేజ్రీవాల్ వారికి కొరుకుడు పడని నాయకుడిగా తయారయ్యారు. అలాంటిది.. ఇప్పుడు కేజ్రీవాల్ కు ఉన్న ప్రజాభిమానానికి తోడు.. సోనూసూద్ ఆదరణ క్రేజ్ కూడా జత కలిస్తే.. ఢిల్లీ రాష్ట్ర గద్దెమీద తాము ఎప్పటికీ కాలు పెట్టలేమనే భయం బీజేపీలో పుట్టినట్టుంది. అందుకే హెచ్చరిక చర్యల్లాగా.. వారు ఈ దాడులు చేయించినట్లుగా ప్రజలు అనుకుంటున్నారు.

సోనూసూద్ అంటే మోడీ దళానికి ఫోబియా ఉండొచ్చు. అందుకని..ఇలాంటి ప్రతీకర చర్యలకు దిగడం పిరికితనం అనిపించుకుంటుంది. సోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు గానీ.. వారికి చేతనైతే.. తమకు సోనూను మించిన సానుకూల ప్రజాదరణ పొందగలిగే పనులు చేయాలి.

మోడీ సర్కార్ కు సోనూసూద్ ఫోబియా ఉందా?
0 votes, 0.00 avg. rating (0% score)