ఐపీఎస్ అధికారి సజ్జనార్ కు దిశ కమిషన్ సమన్లు..!

2019లో హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశ హత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ పై కొందరు దుండగులు అత్యాచారం జరిపి ఆ తర్వాత చంపి తగలబెట్టారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో నిందితులైన దుండగులు ఎన్ కౌంటర్ లో మరణించారు. ఆ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ ఉన్నారు. కాగా ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ సిర్పుర్కర్ కమిటీ కొన్ని నెలలుగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

ఇందులో భాగంగా సజ్జనార్ ను కూడా త్రిసభ్య కమిటీ విచారించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సజ్జనార్ కు సమన్లు కూడా జారీ చేశారు. సజ్జనార్ ను త్రిసభ్య కమిటీ రెండు రోజుల్లోగా విచారించనుంది. అలాగే దిశా ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సమర్పించిన నివేదికపై కూడా ఇవాళ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు మానవహక్కుల సంఘం లోని కొందరు సభ్యులు కమిటీ ముందుకు హాజరు కానున్నారని సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం ఎన్ కౌంటర్ పై సిట్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి మహేష్ భగవత్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా విచారణలో భాగంగా ఇవాళ త్రిసభ్య కమిటీ ముందుకు హాజరు కానున్నారు. ఇప్పటికే మహేష్ భగవత్ పలుమార్లు త్రిసభ్య కమిటీ ముందుకు విచారణకు హాజరయ్యారు. కమిటీ సభ్యులు ఆయనను పలు ప్రశ్నలు అడుగగా సమాధానం చెప్పేందుకు కొంత సమయం కావాలని అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి మహేష్ భగవత్ త్రిసభ్య కమిటీ ముందుకు రానున్నారు.