సినిమా వాళ్లకు సినిమా చూపిస్తున్న జగన్..

అంతా మా ఇష్టం.. మా సినిమా.. మేము తీసిన బొమ్మ.. ఖర్చెక్కువైంది.. టికెట్ ధరలు పెంచుతాం.. మాక్కావాల్సిన వాళ్లకు టికెట్లు ఇస్తాం.. అనే రోజులు ఇక పోయాయి. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు చేస్తున్న నియంత్రుత్వానికి జగన్ చరమగీతం పాడారు. సినిమా రంగాన్ని మొత్తం తన చేతుల్లోకి అంటే ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నాడు. సినిమా మీరు రిలీజ్ చేయండి కానీ.. థియేటర్ టికెట్లు మాత్రం మేమే అమ్ముతాం.. ఆ తరువాత ఆ డబ్బు మీకిస్తాం అని తెలియజేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక జీఓ గత నెల 30న విడుదల చేసినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు షాక్ తిన్నారు. అంతేకాక దీనిపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందో.. అనవసరంగా కామెంట్ చేసి చిక్కుల్లో ఎందుకు పడాలి అని ఆలోచిస్తున్నారట.

ఆర్థిక సమస్య నుంచి గట్టెక్కేందుకు..

వందల కోట్ల రూపాయలు టికెట్ల రూపంలో ప్రేక్షకులు సినిమా థియేటర్ కు చెల్లిస్తున్నారు. థియేటర్లు ఆల్రెడీ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీంతో టికెట్లు వారే అమ్ముకుంటున్నారు. దీనికితోడు ఆన్లైన్ టికెట్ సిస్టం కూడా ఉంది. ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేస్తే 24 గంటల్లో ఆ డబ్బు థియేటర్ యాజమాన్యానికి చేరుతుంది. అయితే ఇపుడు సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ ఇక ఉండకపోవచ్చు. కేవలం ప్రభుత్వం రూపొందించిన విధానంలోనే టికెట్ కొనుక్కోవాలి. అంతేకాక థియేటర్ వద్దకు వెళ్లిన వారు కూడా సర్కారు వెబ్ సైట్ నుంచే టికెట్ ప్రేక్షకుడికి ఇవ్వాలి. అంటే సినిమా మొత్తం సర్కారు కనుసన్నల్లో నడుస్తుందన్నమాట. అసలే ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన ఏపీ సర్కారుకు ఈ ఐడియా ఎవరిచ్చారో కానీ టాలీవుడ్ కు మాత్రం పెద్దషాక్. ఇందుకు సంబంధించి పూర్తి విధి, విధానాలు ఇంకా తెలియకపోయినా నిర్మాతలు మాత్రం కోలుకోలేరనేది సినీవర్గాల టాక్.