హీరో నానికి అండగా నిలిచిన పవన్.. థియేటర్ల యజమానులపై ఫైర్

నాని హీరోగా నటించిన జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. నానిని వారు బాహాటంగానే తిట్టారు. ఇకపై ఆయన సినిమాలను థియేటర్లలో విడుదల చేయమని కూడా కామెంట్స్ చేశారు. థియేటర్ల యజమానుల తీరుపై తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.

సాయిధరమ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరగగా ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల విడుదల పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా హీరో నాని పట్ల థియేటర్ల యజమానులు వ్యవహరించిన తీరుపై స్పందించారు.

‘నాకు..ఈ మధ్య హీరో నాని గారిని థియేటర్ల యజమానులు తెగ తిడుతూ ఉంటే బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగిందంటే.. ఆయన అక్రమాలు.. అన్యాయాలు.. చేయలేదే. నాని హీరోగా ఒక సినిమా చేసుకుని అది రిలీజ్ కోసం థియేటర్లు మూసివేస్తే.. గత్యంతరం లేక ఓటీటీ వైపు వెళ్తే.. థియేటర్ల యజమానులు అందరూ ఆ అబ్బాయి మీద పడితే.. అబ్బాయి ఏం చేస్తాడు…వెళ్లి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి.. మీరు ఆ అబ్బాయి మీద ఏం చేస్తారు. ఆ అబ్బాయి తప్పు ఏముంది.’ అని ప్రశ్నించారు. నాని పట్ల థియేటర్ల యజమానులు ప్రవర్తించిన తీరుపై పవన్ స్పందించడం పట్ల నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.