భీమ్లా నాయక్ సరే.. హరిహర వీరమల్లు ఏమయ్యాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టీజర్ మేనియాతో యావత్ టాలీవుడ్ ఊగిపోతుంది. ఇటీవల రిలీజ్ అయిన భీమ్లా నాయక్ టీజర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూశాం. ఇక ఈ సినిమాను మల్టీ్స్టారర్ మూవీగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆసక్తితో పవన్ ఈ సినిమా కంటే ముందే ప్రారంభించిన మరో సినిమాను జనం మరిచిపోయే స్థితికి చేరుకున్నారు.

అదే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాను భీమ్లా నాయక్ కంటే ముందే అనౌన్స్ చేసి కొంతమేర షూటింగ్ కూడా జరుపుకున్నారు చిత్ర యూనిట్. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అనుకున్నదానికంటే ఆలస్యంగా తెరకెక్కుతుండటంతో భీమ్లా నాయక్ చిత్రంపై పవన్ ఫోకస్ పెట్టాడు. అందుకే ఆ సినమా త్వరగా పూర్తవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందిస్తు్న్న చిత్ర యూనిట్, ఈ సినిమాను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

అందులో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందని, మరి ఇలాంటి సినిమాను పక్కనబెట్టడం ఏమిటని వారు ప్రశ్ని్స్తున్నారు. ఏదేమైనా ‘భీమ్లా నాయక్’పై ఫోకస్‌ను పవన్ కాస్త వీరమల్లుపై కూడా పెట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.