నారా లోకేష్.. దూసుకుపోతున్న టీడీపీ బుల్లెట్..

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుదే హవా.. ఆ తరువాత అల్లుడు చంద్రబాబు నాయుడిది.. ఇపుడు ఎవరిది అనే ప్రశ్న వస్తే.. ఇంకెవరిది బాబు గారిదే అని సమాధానం వస్తుంది. అయితే ఎన్నాళ్లని చంద్రబాబు పార్టీని తన భుజాలపై మోస్తారు. రోజు రోజుకూ వయసు మీద పడుతోంది.. తన రాజకీయ సమకాలీకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కుమారులు జగన్, కేటీఆర్ రాజకీయంగా చాలా ముందంజలోఉంటే తన కుమారుడు నారా లోకేష్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. రాజకీయంగా కుమారుడిని ఓరేంజ్ లో చూద్దామనుకున్న చంద్రబాబుకు నిరాశే మిగిలింది.

ఈసారి ఎన్నికల్లో ఒకవేళ పార్టీ అధికార పగ్గాలు చేపట్టకపోతే ఇక రాజకీయంగా భూస్థాపితం కావాల్సిందే అనే అనుమానాలు, భయాలు బాబులో ఎక్కువగా ఉన్నాయి. అసలే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవాలని, పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ ఎక్కువగా వస్తుండటంతో ఇక మేల్కోకపోతే ముప్పు వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయని గమనించిన టీడీపీ చీఫ్ కుమారుడిని రంగంలోకి దించాడు. అందుకే కొద్ది రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూసుకుపోతున్నాడు. రమ్య అనే విద్యార్థిని దారుణ హత్యకు గురి కావడంతో పార్టీ శ్రేణులతో వెళ్లడం, నిరసన వ్యక్తం చేయడం, అరెస్టు కావడం లాంటి చర్యలతో పార్టీలో కాస్త జోష్ కనిపించింది. ఆ తరువాత ఇపుడు ఆయన ప్రైవేటు టీచర్లకు మద్దతుగా మాట్లాడారు.

కోవిడ్ నేపథ్యంలో ప్రైవేటు టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీరు మాత్రం జగన్ కళ్లకు కనిపించడం లేదని, ఆత్మహత్య చేసుకునే పరిస్తితులు నెలకొన్నాయని మీడియాతో విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలకున్న ఆలోచన కూడా జగన్ కు లేదని ప్రైవేటు టీచర్లకు మద్దతుగా మాట్లాడాడు. లోకేష్ మద్దతు తెలపడంతో ప్రైవేటు టీచర్లకు కాస్త ఊరట కలిగించే విషయం. లోకేష్ ను ఏదో ఒక రకంగా రోజూ ప్రజల్లో ఉండేలా చేయాలని, వార్తల్లో వ్యక్తిగా చూడాలని చంద్రబాబు ఆలోచన అని తెలుస్తోంది. అందుకే రాజకీయంగా లోకేష్ ఎదగడానికి 2023లో అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి చంద్రబాబు సైలెంటుగా సైడై.. లోకేష్ ఎదుగుదలకు దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నట్లు తెలిసింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తాత పోలికలతో ఉన్న మనవడు వచ్చేస్తాడని భయం.