కేసీఆర్ పొలిటికల్ స్టెప్.. ఊహించని ట్విస్ట్

దళితబంధు.. కేసీఆర్ మానసపుత్రిక..ఈనెల 16న హుజూరాబాద్ లో ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు.. అందరూ ఆశ్చర్యపోయేలా బుధవారమే ప్రారంభించారు.. దళిత బంధును ఆయన దత్తత గ్రామంలోనే ప్రారంభించారు. ఈనెల 16న జరిగే కార్యక్రమం కేవలం లాంఛనమే అని.. అధికారికంగా వాసాలమర్రిలోనే ప్రారంభమైందని నేరుగా సీఎమ్మే కుండబద్దలు కొట్టారు. ఉన్నట్టుండి సీఎం ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాదు.. ఆ డబ్బు (రూ.10 లక్షలు) బుధవారమే వారి అకౌంట్లలో వేస్తామని చెప్పారు. దీంతో ఆ గ్రామంలోని లబ్ధిదారుల ఆనందానికి అంతేలేదు. అనుకోని అతిథిలా వచ్చి..ఇలా వరాలిస్తారని ఎవరూ అనుకోలేదు. దీంతో టీఆర్ఎస్ నాయకులతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా నోరెళ్లబెట్టాయి.

దళితబంధు కోసం ఈనెల 16 వరకు ఆగితే.. ఎన్నికల సంఘం పొరపాటున షెడ్యూలు ప్రకటిస్తే.. పథకం ప్రారంభించేందుకు కోడ్ అడ్డమొస్తుంది. దీంతోనే గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. వాసాలమర్రిలో పథకం ప్రారంభించారు కాబట్టి దళితుల్లో భరోసా ఉంటుందనేది ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరో అడుగు ముందుకేసిన కేసీఆర్ రూ. 10 లక్షల్లో రూ.10వేలు మినహాయించుకొని దానికి మరో రూ.10వేలు కలిపి వారి సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తామని తెలిపారు. అంటే దళితబంధు కార్యక్రమానికి ఇచ్చే మొత్తం రూ. 10 లక్షలా 10వేలన్నమాట.. ఈ పథకం సాధ్యమైనంత త్వరగా రాష్ట్రమంతా ప్రారంభించాలని దళితసంఘాలు, వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు అమలు చేస్తారో ఆయనకే ఎరుక..