కేసీఆర్ మరో మైండ్ గేమ్.. తెలుగుదేశం పార్టీకి టెన్షన్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భవన్ ఓ వెలుగు వెలిగింది. నాయకుల రాకపోకలతో అక్కడ ఎప్పుడూ హంగామా ఉండేది. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత అది ప్రాభవం కోల్పోయింది. నాయకులే కాదు.. అధినేత రావడం కూడా తగ్గిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా తగ్గించింది. ఇంకా చెప్పాలంటే టీడీపీ అసలు తెలంగాణలో పేరుకుమాత్రమే ఉందని చెప్పవచ్చు. ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్. రమణ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన తరువాత బక్కని నరసింహులును చంద్రబాబు అధ్యక్షుడిగా నియమించారు. అయితే  ఈ నియామకం ఎందుకంటే.. రాష్ట్రంలో పార్టీ ఉందా అంటే ఉంది అని చెప్పడానికి.. ముఖ్యంగా ఎన్టీఆర్ భవన్ ను కాపాడుకోవడానికి. ఆ బిల్డింగుకు ఏమైంది? అది ఎక్కడకు వెళుతుంది? అనే అనుమానాలు రావచ్చు. అక్కడే ఉంది తిరకాసు. ఎన్టీఆర్ భవన్ కు 30 ఏళ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. 1997 నుంచి 2027 వరకు అన్నమాట. మరో ఆరేళ్లలో లీజు గడువు ముగియనుంది. గడువు ముగిసిన తరువాత లీజు రద్దుచేసి దానిని ఎన్టీఆర్ మ్యూజియంగా మార్చాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిసింది. అలా అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికే ఉండదని..  ఆ పార్టీని అలా.. ఏపీకి పంపించవచ్చనేది గులాబీ బాస్ ప్లాన్.  ఇప్పటికిప్పుడే లీజు రద్దు చేయడం సాధ్యం కాదు.. కానీ 2024 ఎన్నికల్లో ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే మాత్రం 2027 కంటే ముందే లీజ్ రద్దు కావడం  కాదు.. చేయడం ఖాయమని సమాచారం.