హుజూరాబాద్ బై పోల్స్.. ఎన్నికల సంఘానికి టెన్షన్..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గంలో.. త్వరలో జరిగే ఉప ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఆయా పార్టీలు గెలుపు బాటకు ఎవరికి వారు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంటే.. ఉద్యమకారులు, నిరుద్యోగులు, నేతన్నలు ..ఇలా ప్రభుత్వంపై ఆక్రోశం ఉన్న వారంతా తాము నామినేషన్లు వేస్తామని చెబుతున్నారు. ప్రభుత్వానికి తమ సత్తా చూపాలంటే హుజూరాబాద్ లోనే చూపాలని.. అప్పుడైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని వారి భావన. దాదాపు 2200 మంది హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వామ్మో.. ఇంతమంది పోటీచేస్తే వారిని ప్రపోజ్ చేసేందుకు ఒక్కొకక్కరికి పది మంది కావాలి. అంటే 22000 మంది మద్దతు పలుకుతారన్నమాట. అంటే నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లుంటే అందులో పది శాతం మంది తమ ఓటును రాజకీయ పార్టీలకు వేయరన్నమాట. ఉప ఎన్నికల్లో పోటీచేస్తామని ఇప్పటికే ఆర్యవైశ్యులు, ఎంపీటీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నేతన్నలు, ప్రైవేట్ లెక్చరర్లు ప్రకటించారు. ఈ విషయం పక్కన పెడితే ఎన్నికల సంఘానికో టెన్షన్ పట్టుకుంది. వేలమంది రంగంలో ఉంటే ఈవీఎంలను కేటాయించడం కుదరదు. బ్యాలెట్ పేపర్ ముద్రించాల్సిందే.. 2200 మంది పేర్లు ముద్రించాలంటే పేపర్ కాదు.. పుస్తకమే ప్రింట్ చేయాలి.. అంతేనా.. వారికి గుర్తులు కూడా కేటాయించారు. అన్ని వేల గుర్తులు ఎలా కేటాయించాలి అనేది వారి ఆందోళన. ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ ఎప్పుడూ జరగదు. ఓటేసే వారంతా అక్షరాస్యులు కాదు.. అటువంటప్పుడు వేలమంది పోటీలో ఉంటే ఎవరికి ఓటేయాలి.. అభ్యర్థి పేరు ఎప్పుడు వెతుక్కోవాలి.. అలా ఎంతసేపు ఉండాలి.. ఒక్కరోజు సరిపోతుందా అనేది ఆలోచన.