కోర్టు ఖర్చులకే కోట్ల రూపాయలు ఖర్చుపెడితే ఎలా..?

1,2 కాదు.. ఏకంగా 58 కోట్ల రూపాయలు తెలంగాణ సర్కారు ఖర్చు పెట్టింది. అదేం ప్రజాప్రయోజనాల కోసం కాదు.. కోర్టు ఖర్చుల కోసమట.. ఈ విషయం తెలిసీ కోర్టు కూడా నివ్వెరపోయింది..ఇదేంటి.. ఇంత మొత్తం ఖర్చు పెట్టారు అంటే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఆయనతోపాటు రెవెన్యూ, ఫైనాన్స్ కార్యదర్శులకు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులకంటూ ఇంత మొత్తం నిధులు విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం తెలిసిన తరువాత కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం మీద విరుచుకుపడుతున్నారు. మీ సొంత సొమ్ము అయినట్లు ప్రజా ధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేస్తారా? జవాబు దారి లేదా? అని కడిగిపారేస్తున్నారు. దూకుడుగా విమర్శించడంలో ముందుడే కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎవరేం అనుకుంటే మాకేం అన్నట్లుంది సర్కారు తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా.. తెలంగాణ ప్రభుత్వం పెద్దగా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోలేదు.. కదా మరి ఎందుకు అంత మొత్తం డబ్బు విడుదల చేసిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. పోనీ.. పలానా కేసులో పలానా అడ్వకేట్ ప్రభుత్వం తరపున వాదించారు.. ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాం.. అని సమాధానం కూడా చెప్పలేకపోయింది ప్రభుత్వం. ఏమిటో.. ప్రజా ధనమంటే అందరికీ లోకువే.. ప్రభుత్వాలు కూడా అలాగే ఆలోచిస్తే జనం గురించి పట్టించుకునేదెవరో?