ఆర్ఆర్ఆర్ డైలాగ్ ప్రోమో.. రీసౌండ్ మామూలుగా ఉండదట!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నుండి వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘బాహుబలి’ తాత లాంటి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన ఫిక్షన్ కథతో ఆయన మనముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి భారీ ఎత్తున ఈ సినిమాను ప్లాన్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందా అని లెక్కలు వేస్తున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. కాగా ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్, హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఇటీవల ‘దోస్తీ’ అనే థీమ్ సాంగ్‌ను ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేసి అదరగొట్టాడు జక్కన్న. అయితే ఇవన్నీ ఉన్నా కూడా డైలాగ్ ప్రోమో ఒకటి ఉంటే ఆ కిక్కే వేరు అనే విషయాన్ని ఇప్పుడు గుర్తుకు చేసుకున్న డైరెక్టర్, త్వరలోనే మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడట.

ఇద్దరు హీరోలు కలిసిన ఓ సీన్‌కు సంబంధించి ఓ డైలాగ్ టీజర్‌ను కట్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడట. ఈ డైలాగు టీజర్ నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని ఆయన చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఆ డైలాగ్ టీజర్ రీసౌండ్ మామూలుగా ఉండదని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెబుతున్నా, ప్రస్తుతం ఆ సూచనలేవీ కనిపించడం లేదు.