నిధుల వేటలో ఏపీ సర్కార్ కొత్త అడుగు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. ఎవరూ డబ్బులిచ్చే పరిస్థితి లేదు.. సంక్షేమ పథకాల కోసం కోట్ల రూపాయలను జగన్ సర్కారు కేటాయిస్తోంది.. దీంతో రాష్ట్రంలో మిగతా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బ్రిటీష్ హై కమిషనర్ కలిసి.. తాము రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామంటూ ఆసక్తిని కనబరిచారు. బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో రాష్ట్రంలో హెల్త్, ఎనర్జీ, ఎలక్ర్టిక్ వెహికల్స్, అగ్రికల్చర్ టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్ సెక్టార్ తదితర రంగాలలో ఈ డబ్బు వినియోగించాలని సర్కారు భావిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి బ్రిటీష్ హైకమీషనర్ మీటింగ్ కాస్త ఊరట నిచ్చిందనే చెప్పవచ్చు. వివిధ బ్యాంకుల నుంచి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్న సర్కారుకు నిధులు ఇపుడు ఎక్కడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేదు.

వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్న ఏపీ సర్కార్

ఏపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1 నుంచి పది బ్యాంకుల ద్వారా 56,076 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఈ వివరాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ నుంచి రూ.15వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.9450 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.7075 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5797, ఇండియన్ బ్యాంకు నుంచి 4300 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నంచి 2800 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి 2307, పంజాబ్ సింధ్ బ్యాంకు నుంచి 750 కోట్లు రుణం తీసుకుందని ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నతో ఈ వివరాలు వెల్లడయ్యాయి.