వాయిదా పడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలు..?

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులకు చాలా వరకూ పరీక్షల్ని రద్దు చేశాయి. మరి కొన్నింటిని వాయిదా వేశాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశాయి. ఇంకొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవ్వుతుంది. మొత్తంగా చూసినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మేనెల 31వ తేదితో పూర్తయ్యిపోతుంది. ఇకపోతే తెలంగాణలో కూడా ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ నెల 3వతేదితో ముగిసిపోతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది కరోనాతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కరోనా తీవ్రత తగ్గిన తరువాత ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లుతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన శ్రీనివాస్ రెడ్డి జూన్ 3తో ముగియనుంది. వీరిలో ఎంతమందికి మళ్లీ ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి నుంచే ఆ స్థానాల కోసం నాయకులు పోటీపడుతుండటం గమనార్హం. కరోనా టైంలో ఈ ఎన్నికలు వాయిదా పడటం వల్ల నాయకులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.