బ్రేకింగ్ : ఆంధ్ర పరిషత్ ఎన్నికలు రద్దు..!

ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదన్న హైకోర్టు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఈ మేరకు తీర్పును వెలువరించారు.

పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఏప్రిల్‌ 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిని ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు. ఏప్రిల్‌ 7న విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ధర్మాసనం షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్ 8న ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చింది. అయితే, ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలివేయాలని, దీనిపై లోతైన విచారణ జరిపే వ్యవహారాన్ని సింగిల్‌ జడ్జికి అప్పగించింది.