లోకేష్ మళ్లీ త‌డ‌బ‌డ్డాడుగా..

భారీ జ‌న‌సందోహాన్ని చూసి కంగారు ప‌డుతున్నారో.. లేక అవ‌గాహ‌న రాహిత్యంతో మాట్లాడుతున్నారో తెలీదు గానీ.. సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ త‌డ‌బ‌డిపోతున్నారు. ఆయ‌న రాక కోసం ఎదురుచూసిన కార్య‌క‌ర్త‌లు, మంత్రులు, క్యాడ‌ర్‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. త‌న వాక్చాతుర్యంతో అంద‌రూ అవాక్క‌య్యేలా చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో మాట‌జారిన ఆయ‌న‌.. మరోసారి పొర‌పాటు ప‌డ్డారు. విభ‌జ‌న అనంత‌రం ఏపీలో ఉన్న శాస‌న‌స‌భ స్థానాల విష‌యంలో మ‌రోసారి నోరు జారారు.

ఎవరైనా పొరపాటు చేస్తారు. ఒక్కసారి ఓకే. రెండుసార్లు ఓకే. పదే పదే అదే పనిచేస్తే మాత్రం అది పొరపాటు కానే కాదు. క‌చ్చితంగా అది అవగాహన రాహిత్యమే. ఇప్పుడు నారా లోకేష్ విషయంలో ఇదే నిరూపితం అవుతోంది. విభ‌జ‌న అనంత‌రం.. ఏపీలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య గురించి ఎవ‌రిన‌డిగినా 175 అని ఇట్టే చెప్పేస్తారు. కానీ లోకేష్ దృష్టిలో మాత్రం ఇవి 200 అట‌. మ‌రి ఆయ‌న ఏ లెక్క ప్ర‌కారం చెప్పారో తెలీదుగానీ.. ఈ లెక్క విన్న‌వారు మాత్రం అవాక్కై నోరెళ్ల‌బెట్టారు.

మంత్రి పదవి పొందటంపై ఆయన చూపించిన శ్రద్ద.. మిగిలిన విషయాలపై చూపించటం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో అన్నీతనకు తెలిసే జరగాలని కోరుకుంటున్నారు. అందులో మాత్రం స్పీడ్ గా ఉన్నా.. బహిరంగ సభల్లో, వేదికల్లో మాత్రం తన మాటల ద్వారా అభాసుపాలు అవుతున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే బొక్క బోర్లా పడ్డారు. మంత్రి బాధ్యతలు స్వీకారం రోజు కూడా శ్ర‌ద్ధాంజ‌లి అంటూ.. త‌డ‌బ‌డ్డారు.

అంబేద్కర్ జయంతిని..వర్థంతి చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మంచినీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పబోయి…తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా అనంతపురం సభలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మొత్తం 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను ఆయన కోరారు. విద్యార్థులు, నీటి వినియోగ సంఘాల అధ్యక్షులను ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడుతూ… ‘చివరగా మీకు ఒక మాట చెబుతున్నా.. మనం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలి. 2019 ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. భారీ మెజార్టీ అంటే మామూలుగా కాదు. 200 స్థానాలు గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్న విషయం కూడా లోకేశ్‌కు తెలియదా అంటూ అక్కడున్న వారు తెగ చ‌ర్చించుకున్నార‌ట‌.