వెంక‌య్య‌కు పొగ పెడుతోన్న మోడీ..!

ఒక‌ప్పుడు జాతీయ బీజేపీ రాజ‌కీయాల‌ను శాసించిన వ్య‌క్తి… ప్రస్తుత కేంద్ర మంత్రి, తెలుగు వాడు అయిన వెంక‌య్య‌నాయుడుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి బాగా గ్యాప్ వ‌చ్చిందా ? ఏపీలో చంద్ర‌బాబును ప‌దే ప‌దే పొగుడుతూ ఇక్క‌డ బీజేపీ బ‌లోపేతానికి వెంక‌య్య కృషి చేయ‌డం లేద‌ని మోడీ బ‌లంగా న‌మ్ముతున్నారా ? ఈ క్ర‌మంలోనే వెంక‌య్య‌కు పొగ‌పెట్టి కేబినెట్ నుంచి త‌ప్పించేందుకు మోడీ పావులు క‌దుపుతున్నారా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం నుంచి విన‌వ‌స్తోన్న మాట‌.

వాస్త‌వానికి వెంక‌య్య ఆయ‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్ప‌టి నుంచే ఆద్వానీ వ‌ర్గంగా ఉన్నారు. ఇక మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక వెంక‌య్య స్థాయిక‌న్నా త‌క్కువ ర్యాంక్ ప‌ద‌వే వ‌చ్చింద‌న్న చర్చ‌లు కూడా అప్ప‌ట్లో వినిపించాయి. త‌ర్వాత క్ర‌మంలో వెంక‌య్యకు మోడీ ఏపీ, తెలంగాణ‌లో పార్టీ ప‌టిష్టం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పినా వెంక‌య్య తెలంగాణ‌ను వ‌దిలేయ‌డంతో పాటు ఏపీలో ఎక్కువుగా చంద్ర‌బాబు నామ‌స్మ‌ర‌ణే చేస్తున్నారన్న నివేదిక మోడీ వ‌ద్ద‌కు ఎప్పుడో చేరిపోయింద‌ట‌.

ఏపీలో బీజేపీ అధ్య‌క్షుడి ఎంపిక సైతం వెంక‌య్య పెండింగ్‌తోనే ఆగిపోయింది. ఈ క్ర‌మంలో వెంక‌య్య ఉంటే ఏపీలో బీజేపీ ఎద‌గ‌డం క‌ష్ట‌మే అని వెంక‌య్య యాంటీ వ‌ర్గం అధిష్టానానికి నివేదిక చేర‌వేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మోడీ వెంక‌య్య‌ను వ్యూహాత్మ‌కంగా త‌న కేబినెట్ నుంచి త‌ప్పించేందుకు స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది.

త్వ‌ర‌లో జ‌రిగే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ కురువృద్ధుడు అద్వాని రాష్ట్ర‌ప‌తి అవుతార‌న్న టాక్ వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే వెంక‌య్య‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా పంపాల‌ని, ఇందుకు మోడీ ఇప్ప‌టికే ఉప‌రాష్ట్ర‌ప‌తి పేరుకు వెంక‌య్య పేరును మోడీ సిఫార్సు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇలా చేయ‌డం ద్వారా మోడీ చాలా తెలివిగా వెంక‌య్య‌ను త‌న కేబినెట్ నుంచి త‌ప్పించ‌డంతో పాటు పార్టీలో వెంక‌య్య‌కు ప‌ట్టులేకుండా చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఇక మోడీకి-వెంక‌య్య‌కు గ్యాప్ ఎక్కువ‌వ్వ‌డంతోనే మోడీ తిరుప‌తిలో జ‌రిగిన సైన్స్ కాంగ్రెస్‌కు మోడీ వ‌చ్చినా డుమ్మా కొట్టిన‌ట్టు తెలుస్తోంది. వెంక‌య్య ఏపీలో చేస్తోన్న రాజ‌కీయాల‌తో పాటు సొంత పార్టీ బ‌లోపేతాన్ని ప‌క్క‌న‌పెట్టి చంద్ర‌బాబుకే ఎక్కువ ప్ర‌యారిటీ ఇవ్వ‌డం కూడా వెంక‌య్య‌పై మోడీ తీవ్ర అసంతృప్తితో ఉండేందుకు కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తోంది. మ‌రి వెంక‌య్య ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లేందుకు ఎంత వ‌ర‌కు ఒప్పుకుంటారో ? ఆయ‌న విష‌యంలో మోడీ వ్యూహం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.