దగ్గుబాటి పురందేశ్వరి! అన్న ఎన్టీఆర్ కుమర్తె అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకురాలు. పరుచూరు నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన ఈమె.. తనకంటూ ప్రత్యేక ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్నారు. అన్నగారు మరణించే వరకు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉండగా, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన తెరమరుగయ్యారు. ముఖ్యంగా టీడీపీలో జరిగిన కొన్ని కీలక పరిణామాల విషయంలో కలత చెందిన పురందేశ్వరి.. ఆ పార్టీ తన తండ్రి స్థాపించినదే అయినప్పటికీ.. ఏ రోజూ జెండాను మోసిందిలేదు.. అనుకూలంగా మాట్టాడిందీ లేదు!
అంతేకాదు, తన తండ్రి ఎన్టీఆర్ ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పెట్టారో.. ఎవరి వద్ద తెలుగు వారి ఆత్మగౌరవ నినాదం వినిపించారో.. వారి వద్ద.. అంటే కాంగ్రెస్ నేతల వద్ద, కాంగ్రెస్ నేతల్లోను పురందేశ్వరి కలిసిపోయారు. దివంగత వైఎస్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ కండువా కప్పుకొన్న పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీగా గెలిచి.. తర్వాత కేంద్రంలో కొలువు కూడా కొట్టేశారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవడంతో ఆమె పార్టీ ఫిరాయించినా.. టీడీపీ జోలికి మాత్రం పోలేదు. ఆమె మరో జాతీయ పార్టీ, కాంగ్రెస్కు బద్ధ శత్రువు బీజేపీ గూటికి చేరిపోయారు.
వాస్తవానికి ఏపీలో టీడీపీ-బీజేపీ బలమైన మిత్రపక్షంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న క్రమంలో పురందేశ్వరి బీజేపీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ అంటే గిట్టదు, ఆ పార్టీ అధినేతగా చంద్రబాబును ఊహించే సాహసం కూడా చేయలేని పురందేశ్వరి బీజేపీలో చేరి .. టీడీపీకి అనుకూలంగా ఎలా ఉంటారా? అని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. వీరికి షాక్ ఇస్తూ.. పురందేశ్వరి.. సీఎం చంద్రబాబు మిత్రపక్ష సీఎం అని కూడా చూడకుండా విమర్శలు సంధించారు. ఏడాది కిందట రాష్ట్రంలో కేంద్రం ఇస్తున్న నిధులతో చేపట్టిన పనులకు శ్వేత పత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
డామిట్! ఇప్పుడు కథ అడ్డం తిరిగింది! ఢిల్లీ కమల నాథుల నుంచి ఎలాంటి వర్తమానం వచ్చిందో ఏమో.. పురందేశ్వరి మారిపోయింది! మరిదిగారి మీద ప్రేమతో కాకపోయిన బీజేపీ నేతలపై ఉన్న భక్తితో ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ నేతల గెలుపుకోసం వీధి వీధిలోనూ తిరుగుతున్నారు. అంతేకాదు, టీడీపీ-బీజేపీ కండువాలను మెడలో వేసుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ముఖ్యంగా బాబుపై ఒంటికాలిపై లేచిన పురందేశ్వరేనా ఈవిడ? అనే రేంజ్లో చర్చలు సాగాయి. ఏదైనా చిన్నమ్మ(కుటుంబంలో ముద్దుగా ఇలానే పిలుచుకుంటారు) రూటు సెపరేటు అని నిరూపించింది. జై… బోలో ఇండియన్ పాలిటిక్స్!!