వెంకటేష్ ‘సైంధవ్‌’ విడుదల తేదీని ప్రకటన… వచ్చేది అప్పుడే!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ నటించిన తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం సైంధవ్‌. ఈ సినిమా వెంకీ 75వ చిత్రంతా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ డేట్ చూడగానే వెంకీ మామ కూడా సంక్రాతి బరిలోకి దిగనున్నారని ఇట్టే అర్ధం అయిపోతుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. అందులో బడా బడా హీరోలు సైతం వున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్‌తో పాటు రజనీకాంత్‌ లాల్‌ సలాం మూవీలు క్యూలో వున్నాయి. ఇప్పుడు వెంకీ కూడా సంక్రాంతికే వస్తుండడంతో పోటీ భారీగా నెలకొంది. ఇదిలా ఉంటే నిజానికి సైంధవ్‌ మూవీ క్రిస్మస్‌ కానుకగా విడుదల కావాల్సి వుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. దానికి కారణం ఆ సినిమాపైన వున్న అంచనాలే కారణమని తెలుస్తోంది. సినిమా ఔట్ పుట్ సూపర్ గా వచ్చిందని ఇన్ సైడ్ వర్గాల సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో సైంధవ్‌ విడుదలను వాయిదా వేసుకున్నట్లు మరోవైపు వినబడుతోంది.

ఇకపోతే చాన్నాళ్ల తరువాత ఈ సారి సంక్రాంతి బరిలో దిగుతోన్న వెంకీ మామ ఎలాంటి హిట్‌ను అందుకుంటారో అని అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. సైంధవ్‌ మూవీలో ఆర్య‌, శ్ర‌ద్ధాశ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ, ఆండ్రియాతో పాటు బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ ఓ కీల‌క భూమిక పోషిస్తోన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు దక్షిణాదికి చెందిన అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు దసరా మూవీకి సంగీతం అందించిన నారాయణ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, వెంకట్‌ బోయనపల్లి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.