మ‌రోసారి బాల‌య్య హెల్ప్ తీసుకుంటున్న‌ రామ్‌.. ఒకే వేదిక‌పై బాబాయ్‌-అబ్బాయ్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మ‌ధ్య ఎంతో మంది అనుభ‌వం ఉంది. బాల‌య్య‌ను రామ్ బాబాయ్ అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తుంటాడు. బాల‌య్య సైతం రామ్ ను త‌న సొంత కొడుకులా భావిస్తుంటాడు. రామ్ డెబ్యూ మూవీ `దేవదాస్` ద‌గ్గ‌ర‌ నుంచి పలు చిత్రాల వేడుకలకు బాలయ్య స్పెష‌ల్ గెస్ట్ గా విచ్చేసి.. రామ్ కు తన విషెస్ తెలిపాడు. సింహాతో సహా బాల‌య్య న‌టించిన‌ పలు సినిమా ఈవెంట్స్ కు రామ్ సైతం హాజరయ్యాడు.

అయితే ఇప్పుడు మ‌రోసారి రామ్ బాల‌య్య హెల్ప్ తీసుకోబోతున్నాడు. రామ్ తాజా చిత్రం `స్కంద‌`. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రంలో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. నిజానికి ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, అప్పుడు భ‌గ‌వంత్ కేస‌రితో బాల‌య్య వ‌స్తున్నాడు. ఆయ‌న‌తో ఉన్న అనుబంధం కార‌నంగా రామ్ త‌న సినిమా రిలీజ్ ను ప్రీపోన్ చేసుకున్నాడు.

సెప్టెంబర్ 15న స్కంద తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ గ్లింప్స్ తో పాటు రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల‌కు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 26న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతోంది. అయితే ఈ ఈవెంట్ కు బాల‌య్య స్పెష‌ల్ గెస్ట్ గా హాజ‌రు కాబోతున్నారట‌. బాల‌య్య చేతుల మీద‌గా స్కంద ట్రైల‌ర్ బ‌ట‌య‌కు రానుంద‌ని అంటున్నారు. దీంతో చాలా గ్యాప్ తర్వాత బాబాయ్ – అబ్బాయి కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్నారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.