బిగ్‌బాస్-7లో కిక్కెక్కించే చేంజెస్.. సీక్రెట్ రూమ్ లో విడాకుల జంటలు..

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్. ఇతర భాషల్లో ఎప్పుడో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 1 స్టార్ట్ అయిన కొత్తలో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ చిన్న చిన్నగా హౌస్ లో ఇచ్చే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు లాంటివి ఆడియన్స్ కి కాస్త ఇంట్రెస్ట్ కలిగించాయి. అలా ఫస్ట్ సీజన్ మంచి విజయం సాధించడం తో ఆరవ సీజన్ వరకు వచ్చింది.

ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ షోకి హోస్టులుగా ఎన్టీఆర్, నాని, నాగార్జునలు నిర్వహించారు. అయితే చివరి 4 సీజన్లకు మాత్రం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో నాలుగో సీజన్ హీట్ అయినట్లుగా మరే సీజన్ హిట్ అవ్వలేదు. ఇక లాస్ట్ సీజన్ అయితే అసలు ఎంటర్టైనింగ్ గా లేదంటూ ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఈ సీజన్ కి టిఆర్పి రేటింగ్ కూడా బాగా పడిపోయింది. అందుకే 7వ సీజన్ అయినా మంచి హిట్ సాధించేలా చెయ్యాలని స్టార్ మా టీమ్ బాగా కష్టపడుతున్నారు. దానికి తగ్గట్టుగా కొత్త ఐడియాలని సీజన్ 7 లో జోడిస్తున్నారు.

అయితే ఆరో సీజన్ ఫ్లాప్ అవ్వటానికి ప్రధాన కారణం కంటెస్టెంట్స్ అని నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 6లో కాంటెస్టెంట్స్ విషయంలో చేసిన తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఈసారి బుల్లితెరపై బాగా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలను ఎంపిక చేయటంతో పాటు, వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న ఒక పాపులర్ జంటను కంటెస్టెంట్ గా ఎంచుకున్నారట. అంతేకాకుండా విడాకులు తీసుకున్న జంటను సీక్రెట్ రూమ్ లో ఉంచబోతున్నట్లు సమాచారం. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహారిస్తున్నారట. ఇదంతా చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ అవ్వటానికి స్టార్ మా టీమ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. చూడాలి మరి సీజన్ 7 ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందనేది!