ఆ రంగంలో అదరగొట్టిన ముద్దుగుమ్మ అంజలి.. హాఫ్ సెంచరీతో రికార్డ్..

ప్రముఖ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫొటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అందానికి అందం, నటనకు నటన, అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినీ రంగంలో ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను, బాధలను అధిగమించి ప్రస్తుతం తన 50వ సినిమా వరకూ చేరుకుంది. హౌస్ సెంచరీ పూర్తి చేసి అరుదైన రికార్డ్ సాధించింది.

అయితే మన తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా తెలుగు దర్శక నిర్మాతలు అవకాశం ఇవ్వరు. అందుకే తమిళంలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తమిళ్ ఇండస్ట్రీలో చిన్న చిన్నగా ఎదుగుతూనే తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అంగాడి తెరు, ఎంగేయుమ్ ఎప్పోధూమ్ లాంటి సినిమాలు తమిళ పరిశ్రమలో అంజలి కెరీర్ ని మలుపు తిప్పాయి. ఇక తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, వకీల్ సాబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ ముద్దుగుమ్మ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్లు అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన విషయాలను, తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన ఫోటోషూట్లతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో అంజలి కీలకపాత్రలో నటిస్తుంది. తమిళంలో ఝాన్సీ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం మరో వెబ్‌సిరీస్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా అంజలి తమిళ్ లో అశోక్ వేలాయుధం దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించబోతుంది. ఈ సినిమాతో అంజలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోబోతుంది. ఈ సినిమాతో తన 50వ సినిమా పూర్తి కాబోతుందని చాలా సంతోషంగా ఉంది అంజలి.